Begin typing your search above and press return to search.

బాబుకు మ‌ళ్లీ బీపీ పెంచేస్తున్న సొంత జిల్లా ఎంపీ

By:  Tupaki Desk   |   2 Jun 2017 8:49 AM GMT
బాబుకు మ‌ళ్లీ బీపీ పెంచేస్తున్న సొంత జిల్లా ఎంపీ
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో మ‌రో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి త‌లెత్తింది. ద‌ళితుల‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ కొద్దికాలం క్రితం నిర‌స‌న‌ గ‌ళం వినిపించి క‌ల‌క‌లం రేకెత్తించి చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ తాజాగా అదే వాద‌న మ‌ళ్లీ చేశారు. స్థానికంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన టీడీపీ ఎంపీ. ద‌ళితుల‌కు అన్యాయం చేసేలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని తేల్చిచెప్పారు. ద‌ళితులు నిర‌స‌న విర‌మించేలా అధికారులు త‌గు చ‌ర్య‌లు తీసుకోక‌పోతే సీఎంతో చంద్ర‌బాబుతోనే చ‌ర్చిస్తానంటూ స్ప‌ష్టం చేశారు.

చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం కొప్పెడు హరిజనవాడలో ప్లాంట్‌ కి వ్యతిరేకంగా గ‌త ఐదు రోజులుగా రిలే దీక్షలు జరుగుతున్నాయి. అయితే ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవడంతో... పవర్ ప్లాంట్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న గ్రామానికి వెళ్లిన ఎంపీ శివ‌ప్ర‌సాద్‌ స్థానికులతో మాట్లాడారు. వారికి ఎదురవుతున్న కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. వారి ఆందోళ‌న‌కు మద్దతు పలికారు. పవర్ ప్లాంట్‌ కు ఒక చోట అనుమతి పొంది మరొకచోట నిర్మాణం చేస్తున్న విషయంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎంపీ శివప్రసాద్ హామీ ఇచ్చారు. కొప్పేడులో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్తానని ప్ర‌క‌టించారు. గ్రామంలో తాగునీటి ఇబ్బంది పరిష్కరించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి బోర్‌ వెల్ తవ్వించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతానని శివప్రసాద్ హామీ ఇచ్చారు.

కాగా, పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా, తాగునీటి సమస్య పరిష్కారం కోసం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు మండలంలోని కొప్పెడు గ్రామస్తులు చేపట్టిన దీక్ష ఐదు రోజుల‌గా కొన‌సాగుతోంది. సీఎం సొంత జిల్లాలో ద‌ళితుల ఆందోళ‌న నేప‌థ్యంలో స్థానిక ఆర్డీఏ స‌మ‌స్య ప‌రిష్కారానికి సిద్ధ‌మ‌య్యారు. ధ‌ర్నా జ‌రుగుతున్న ప్రాంతానికి వ‌చ్చి పవర్‌ ప్లాంట్‌ కట్టడం వల్ల మీకు కలిగే నష్టమేమిటని గ్రామీణుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే షుగర్‌ ఫ్యాక్టరీ అనుకొని తమ గ్రామం ఉందని, ఫ్యాక్టరీ ఆవరణలో పవర్‌ ప్లాంట్‌ను నిర్మించొద్దని ఎన్నోసార్లు అధికారులకు, తహశీల్దార్‌కు విన్నవించినప్ప‌టికీ ఏ అధికారి తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు. ఈ సంద‌ర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఇండ్రస్టీయల్‌ వారు అనుమతించారని, అందుకు జీవో ఇచ్చారని తెలిపారు. అయితే ప్లాంట్ ఏర్పాటు అంశం కోర్టులో ఉంద‌ని పేర్కొంటూ దీనిపై మూడు రోజుల్లో కోర్టు తీర్పు వస్తుందని ఆర్డీఓ వారికి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/