Begin typing your search above and press return to search.

బాబు గెల‌వ‌టం టీజీ కొడుక్కి ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   5 Aug 2018 10:54 AM GMT
బాబు గెల‌వ‌టం టీజీ కొడుక్కి ఇష్టం లేదా?
X
రంగం ఏదైనా స‌రే.. వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌టం ఇప్పుడు చూస్తున్న‌దే. అదేం ఖ‌ర్మో కానీ.. ఆంధ్రోళ్ల‌కు ఇప్పుడు పెద్ద ఇబ్బంది వ‌చ్చి ప‌డింది. పారిశ్రామిక‌వేత్త‌ల్ని.. వ్యాపార‌స్తుల్ని కోరి మ‌రీ ఎన్నుకోవటం తెలిసిందే. అదే.. రాష్ట్రం ముక్క‌లు అయ్యే వ‌ర‌కూ తేవ‌ట‌మే కాదు.. విభ‌జ‌న వేళ‌లో ఏపీకి జ‌ర‌గాల్సిన న్యాయం జ‌ర‌గలేదు.

ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఆంధ్రోళ్ల తీరు మార‌లేదు. రాజ‌కీయాలంటే త‌మ వ్య‌క్తిగ‌త వ్యాపారాలు.. ఆస్తులు పెంచుకోవ‌టం మిన‌హా మ‌రింకేమీ కాద‌న్న‌ట్లుగా ఉన్న నేత‌ల్ని వారు ప్ర‌శ్నించ‌టం లేదు. అంతేనా..ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా ఎవ‌రైనా మాట్లాడితే వారిని అడ్డుకోవ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌రిచేలా వారు వ్య‌వ‌హ‌రించ‌టం లేదు.

పారిశ్రామిక‌.. వ్యాపార రాజ‌కీయ నేత‌ల తీరు ఇలా ఉంటే.. వారి వార‌సులు సైతం ఇప్పుడు సీన్లోకి వ‌చ్చేశారు. మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా వారు జోరుగా రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే.. ఇవ‌న్నీ గ‌ల్లీ లెక్క‌ల మాదిరే ఉంటున్నాయే త‌ప్పించి.. కాస్త దూర‌దృష్టి అన్న‌దే లేకుండా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఎవ‌రి దాకానో ఎందుకు క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల్లో ఒక‌రైన టీజీ వెంక‌టేశ్ వ్య‌వ‌హారాన్నే చూడండి. విభ‌జ‌న ఉద్య‌మం జోరుగా సాగే వేళ‌లో ఆయ‌న చేసిన హ‌డావుడి ఎంతో తెలుసు. కీల‌క‌మైన వేళ‌లో కుటుంబంతో స‌హా విదేశాల‌కు చెక్కేసిన ఆయ‌న‌.. మాతృభూమి విష‌యంలో త‌న‌కున్న క‌మిట్ మెంట్ ఎంత‌టిదో చేత‌ల‌తో చెప్పేశారు.

త‌నను మంత్రిని చేసిన పార్టీని ఎంత‌లా వాడుకున్నారో తెలిసిందే. విభ‌జ‌న వేళ‌లో పార్టీ నాయ‌క‌త్వానికి కోపం క‌ల‌గ‌కుండా ఉన్న ఆయ‌న‌.. ప్ర‌జాగ్ర‌హాన్ని గుర్తించి సింఫుల్ గా పార్టీ మారిపోయి.. త‌న పాపాన్ని క‌డిగేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

బాబు లాంటి అధినాయ‌కుడ్ని ఎలా బుట్ట‌లో వేసుకోవాలో తెలిసిన టీజీ.. అందుకు త‌గ్గ‌ట్లే ఎమ్మెల్యేగా ఓడిన ఆయ‌న‌.. కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలోనే రాజ్య‌స‌భ‌కు ద‌ర్జాగా వెళ్ల‌గ‌లిగారు. అక్క‌డితో సంతృప్తి చెందితే ఆయ‌న టీజీ ఎందుకు అవుతారు? తాను ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్న వేళ‌.. రాష్ట్రంలో త‌న వార‌సుడిగా కొడుకును దించాల‌న్న ప్లాన్ చేశారు. అయితే.. ఆయ‌న ఆశించినంత జోరుగా పావులు క‌ద‌ప‌టంలో అబ్బాయిగారు ఫెయిల్ అవుతున్నారు.

దీంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు అసెంబ్లీ సీటు త‌మ‌దేన‌న్న భావ‌న‌లో ఉన్న ఆయ‌న‌కు చిన‌బాబు లోకేశ్ షాకిస్తూ.. ఆ సీటు ఎస్వీ మోహ‌న్ రెడ్డికి ఇవ్వ‌టంతో ఆయ‌న నోట వెంట మాట రాలేదు. లోకేశ్ ప్ర‌క‌ట‌న‌కు చిర్రుబుర్రులాడిన టీజీకి.. త‌త్త్వం బోధ ప‌డి.. అధినేత‌ను ఏదోలా ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.

గ‌తానికి మించి త‌న కొడుకును మ‌రింత యాక్టివ్ గా ఉండాల‌న్న స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. టికెట్ విష‌యంలో చివ‌రి క్ష‌ణాల్లో జ‌రిగే అద్భుతం మీద ఆశ‌లు పెట్టుకున్న టీజీ తీరుకు త‌గ్గ‌ట్లే.. ఆయ‌న కుమారుడు సైతం అదే ఆశ‌తో ఉన్నారు. త‌మ‌కు కాకుండా పోతున్న క‌ర్నూలు అసెంబ్లీ సీటు విష‌యంలో టీజీ భ‌ర‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు బాబుకు ఆగ్ర‌హాన్ని తెప్పించ‌ట‌మే కాదు.. చికాకు పెట్టే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇంత‌కీ.. టీజీ భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. క‌ర్నూలు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నిక‌ల్లో బాబు క‌ర్నూలు నుంచి పోటీ చేయాల‌ని వ్యాఖ్యానించారు.బాబు కానీ జిల్లా నుంచి పోటీ చేస్తే 14 సీట్లు టీడీపీ ఖాతాలో ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు.

ఒక‌వేళ బాబు కానీ క‌ర్నూలు నుంచి పోటీ చేయ‌ని ప‌క్షంలో.. సర్వే ప్ర‌కారం గెలిచే వారికే క‌ర్నూలు సీటును కేటాయించాలంటూ పీట‌ముడిని వేశారు. ఓవైపు క‌ర్నూలు అసెంబ్లీ స్థానాన్ని ఎస్వీ మోహ‌న్ రెడ్డికి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా ఇలా కెల‌క‌టం బాగోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. త‌మ లోక‌ల్ రాజ‌కీయాల్లోకి నేరుగా బాబునే తీసుకురావ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. క‌ర్నూలు జిల్లాలో అంతంత మాత్రంగానే టీడీపీ బ‌లం ఉంది. ఒక‌వేళ బాబు కానీ క‌ర్నూలు బ‌రిలో దిగితే.. తుది ఫలితం ఏమ‌వుతుంద‌న్న సందేహం లేక‌పోలేదు. నిన్న మొన్న‌టివ‌ర‌కూ మోడీతో జ‌త‌క‌ట్టిన బాబును.. క‌ర్నూలు పాత‌బ‌స్తీలోని మైనార్టీలు క్ష‌మిస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌. అంతేకాదు.. భ‌ర‌త్ చెప్పిన‌ట్లుగా బాబు పోటీ చేసిన త‌ర్వాత కూడా క‌ర్నూలులో అనుకున్న సీట్లు గెల‌వ‌ని ప‌క్షంలో దానికి బాధ్య‌త వ‌హించాల్సిన భారం బాబు మీదే ఉంటుంది. సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పంను వ‌దిలేసి.. క‌ర్నూలులో పోటీ చేస్తే.. స్థానికంగా వ్య‌తిరేక‌త రావ‌ట‌మే కాదు.. బాబు తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం ఖాయం. ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తేందుకు వీలున్న అంశంలోకి త‌న‌ను తీసుకువ‌స్తున్న టీజీ భ‌ర‌త్ తీరుపై బాబుకు ఒళ్లు మండ‌టం ప‌క్కా అని చెబుతున్నారు. కొడుకును రాజ‌కీయ చ‌ద‌రంగంలోకి తీసుకొచ్చే ముందు.. ఎప్పుడు ఏ పావును క‌ద‌పాలో స‌రిగా ట్రైనింగ్ ఇవ్వ‌లేదా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు.