Begin typing your search above and press return to search.

ఈ ఎంపీకి కి రోజులు దగ్గర పడినట్లేనా ?

By:  Tupaki Desk   |   9 Oct 2021 6:39 AM GMT
ఈ ఎంపీకి కి రోజులు దగ్గర పడినట్లేనా ?
X
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వ్యవసాయ చట్టాల రద్దుపైన, కారు ప్రమాధ ఘటనకు కారకులపై చర్యల విషయంలో ఎంపి వరుణ్ గాంధీ పదే పదే రెచ్చిపోతుండటంతో బీజేపీ సీనియర్లలోనే అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. నరేంద్రమోడి ఆలోచనలకు భిన్నంగా మంత్రివర్గంలోనే కాదు పార్టీలో కూడా ఎవరు నోరెత్తెందుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

మోడిని బహిరంగంగా ప్రశ్నించిన, మోడీ విధానాలను విమర్శించిన కొందరు సీనియర్లకు ఏ గతిపట్టిందో అందరు చూసిందే. మోడి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే కారణంపై మాజీ ఎంపి, సీనియర్ నేత శతృజ్ఞ సిన్హా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. అందుకనే వ్యవసాయ చట్టాలపై మోడిని తప్పు పడుతున్నందుకు, ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన దుర్ఘటన విషయంలో నిందితులపై చర్యలకు పదే పదే డిమాండ్ చేస్తున్నందుకు ఎంపి వరుణ్ గాంధీ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళక తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.

నిజానికి వరుణ్ చేస్తున్న డిమాండ్లు, సూచనల్లో తప్పేమీలేదు. మెజారిటి రైతులు, రైతుసంఘాలు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాలకు సవరణలు తేవాలని లేదా రద్దు చేయాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయచట్టాలకు సవరణలు చేసినా, రద్దు చేసినా రైతులు సంతోషిస్తారనటంలో సందేహంలేదు. కానీ ఆపని చేయటానికి మోడి ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకనే రైతుల పేరుతో మోడి తెచ్చిన నూతన వ్యవసాయచట్టాలు నూరుశాతం కార్పొరేట్లకే ప్రయోజనాలంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

వ్యవసాయ చట్టాల సంగతి పక్కన పెడితే మొన్నటి ఆదివారం యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మద్దతుదారుల (కొడుకు) వాహనాలు దూసుకుపోవటం సంచలనమైంది. నిజానికి మరో ఐదు నెలల్లో యూపీలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగటం అధికార బీజేపీకి చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి. అంతిమంగా కోర్టు విచారణలో ఏమి జరుగుతుందన్నది వేరేసంగతి. ముందైతే బీజేపీకి బాగా డ్యామేజి జరిగిపోయిందన్నది వాస్తవం.

జరిగిన డ్యామేజ్ నుండి పార్టీ లేదా ప్రభుత్వం బయటపడాలంటే అందుకు బాధ్యులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో ఉపేక్షిస్తున్నాయి. ముందుగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను మంత్రవర్గం నుండి సాగనంపటమే ఏకైక మార్గం. కానీ ఆ పని చేయటం మోడీకి ఏమాత్రం ఇష్టం ఉన్నట్లులేదు.

ఇక్కడే ఫిలిబిత్ ఎంపి వరుణ్ గాంధీ పదే పదే ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. వరుణ్ చేస్తున్న డిమాండ్లు, షేర్ చేస్తున్న వీడియోలు ప్రతిపక్షాల చేతికి ఆయుధాలు ఇచ్చినట్లవుతోంది. అందుకనే ఎంపిని పార్టీలో ఎక్కువరోజులు ఉంచుకునే అవకాశం లేదని ప్రచారం పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.