Begin typing your search above and press return to search.

మోడీ వెంటపడుతున్న ఎంపీ

By:  Tupaki Desk   |   21 Nov 2021 12:30 PM GMT
మోడీ వెంటపడుతున్న ఎంపీ
X
నరేంద్రమోడిని సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ వదలకుండా వెంటపడుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మోడిని చాలాకాలంగా ఎంపీ పదే పదే డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ కిసాన్ సంఘ్ దాదాపు ఏడాది కాలంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నది. ఇదే సమయంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దాంతో రైతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఆయన కొడుకు తదితరులు రెచ్చిపోతున్నారు.

లఖింపూర్ ఖేరిలో ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కొడుకు వాహనం నడపటంతో నలుగురు మరణించిన విషయం దేశంలోనే సంచలమైంది. ఇలాంటి అనేక ఘటనలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై అనుమానాల కారణంగా వ్యవసాయ చట్టాలను మోడి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని వరుణ ప్రస్తావిస్తు మోడికి ఓ లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు ధన్యవాదాలు చెబుతునే అనేక డిమాండ్లు చేశారు.

ఏడాదిగా జరుగుతున్న ఉద్యమంలో 700 మంది రైతులు మరణించారట. కాబట్టి చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం తలా కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించాలన్నారు. రైతులపై ఉద్యమం సందర్భంగా నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తేయాలంటు డిమాండ్ చేశారు. అలాగే కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ చాలా కీలకమైంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ సీజన్లో కేంద్రం పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తోందంతే. అందుకనే కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నది.

లఖింపూర్ ఖేరీలో రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. నిజానికి కేంద్రమంత్రిని ఎప్పుడో మంత్రివర్గం నుండి మోడి తప్పించుడాల్సింది. ఘటన జరిగి నెలన్నర అవుతున్నా మోడి ఆ పనిచేయకపోవటంతో రైతుల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని ఎంపీ తన లేఖలో గుర్తుచేశారు.

ఇక రాజకీయంగా ఆలోచిస్తే సొంతపార్టీ ఎంపీయే మోడికి పదే పదే లేఖలు రాయటం బీజేపీని బాగా ఇరుకునపెడుతోంది. రైతులకు మద్దతుగా ఎంపీ రాస్తున్న లేఖల్లో తప్పుపట్టాల్సిందేమీ లేదు. కానీ కేంద్రప్రభుత్వం వైఖరికి భిన్నంగా లేఖలు ఉండటంతో మోడిలో అసహనం పెరిగిపోతోంది. అలాగని ఈ సమయంలో ఎంపీపై చర్యలు తీసుకోలేరు, అలాగని ఉత్తినే వదిలేయలేరు. దాంతో ఎంపీని ఎలా కట్టడి చేయాలో అర్ధంకాక బీజేపీ తల్లక్రిందులవుతోంది.