Begin typing your search above and press return to search.

మోడీకే షాకిచ్చిన సొంతపార్టీ ఎంపీ

By:  Tupaki Desk   |   14 Jun 2022 5:34 AM GMT
మోడీకే షాకిచ్చిన సొంతపార్టీ ఎంపీ
X
నరేంద్రమోడికి బీజేపీ ఎంపీయే పెద్ద షాకిచ్చారు. చాలాకాలంగా ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ ఎంపీ వరుణ గాంధి రెబల్ ఎంపీలాగే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోని లోపాలతో పాటు కేంద్రప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు.

కేంద్రప్రభుత్వంపై డైరెక్టుగానే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఎంపీ వైఖరి వల్ల కేంద్రప్రభుత్వం చాలాసార్లు ఇబ్బందుల్లో పడింది. యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై వాహనం నడిపిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు. ఘటన వెలుగులోకి రాగానే సాక్ష్యాధారాల కోసం చూస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వెంటనే ఘటనకు చెందిన వీడియోను వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాద్వారా వెలుగులోకి తెచ్చారు. దాంతో ఘటనపై ఏమి మాట్లాడాలో తెలీక కేంద్రప్రభుత్వం చాలా ఇబ్బందిపడింది. ఇలాంటి అనేక ఘటనలతో కేంద్రాన్ని ఇబ్బందిపెడుతున్న ఎంపీ తాజాగా నిరుద్యోగంపై కొన్ని లెక్కలను ప్రకటించారు.

2014 ఎన్నికల ప్రచారంలో ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలను భర్తీచేస్తానని మోడి హామీఇచ్చిన సంగతి గుర్తుండేఉంటుంది. అదే విషయాన్ని ఎంపీ తాజాగా లేవనెత్తారు. భారత్ లో నిరుద్యోగం చాలా తీవ్రస్ధాయిలో ఉందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతమవుతుందన్నారు. ఒకవైపు దేశంలో ఉద్యోగాలు లేక కోట్లమంది యువత నిరుత్సాహంతో అవస్తలు పడుతుంటే మరోవైపు వివిధ శాఖల్లో 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండటం ఏమిటని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మంజూరై భర్తీకి నోచుకోకుండా ఉన్న ఖాళీల వివరాలను ఎంపీ వివరించటం మోడికి తలనొప్పులుగా తయారైంది. ఉద్యోగాల భర్తీని ఆర్భాటంగా ప్రకటించిన మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అసలా ఊసే ఎత్తటంలేదు.

పార్లమెంటులో ప్రతిపక్షాలు, బయట నిరుద్యోగులు ఎంతగా డిమాండ్లు చేస్తున్నా ఉద్యోగాల భర్తీకి మోడి మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపటంలేదు. పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఏమవుతుందోని వరుణ్ మోడిని నిలదీశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, వాటికి కేటాయిస్తున్న బడ్జెట్ వివరాలను తెలుసుకునే హక్కు నిరుద్యోగులకుందని వరుణ్ చేసిన ప్రకటన కేంద్రానికి తలనొప్పిగా తయారైంది.