Begin typing your search above and press return to search.

మాటలు మంట పుట్టాలే కానీ ఇంతలా వివరణ ఇచ్చుడేంది విజయసాయి?

By:  Tupaki Desk   |   12 Oct 2022 4:55 AM GMT
మాటలు మంట పుట్టాలే కానీ ఇంతలా వివరణ ఇచ్చుడేంది విజయసాయి?
X
విజయసాయి.. పేరుకు తోపు ఆడిటరే కానీ అంతకు మించిన తోపు రాజకీయ నాయకుడిగా చూడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెచ్చిన ఆయన టాలెంట్ గురించి చాలామంది తక్కువ అంచనా వేయటమే ఆయన విజయంగా పలువురు అభివర్ణిస్తారు. సిచ్యువేషన్ ఏదైనా.. వెనుకా ముందు చూసుకోకుండా విరుచుకుపడే ఈ తరం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాల్ని పుణికి పుచ్చుకున్న ఆణిముత్యంగా ఆయన్ను చెప్పాలి. తెలుగు రాజకీయాలు.. అందునా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రత్యర్థుల్ని మొహమాటం లేకుండా ఎన్నెన్ని మాటలైనా అనేయటమే కాదు.. అవసరానికి అనుగుణంగా బండ బూతులు తిట్టేసే సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన ప్రముఖుడిగా విజయసాయి చెప్పాల్సిందే.

అలాంటి ఆయన తన తీరుకు భిన్నంగా విరుచుకుపడటం వదిలేసి.. వివరణ ఇస్తున్నట్లుగా చెబుతున్న మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. దసపల్లా భూముల ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారటమే కాదు.. సరికొత్త దుమారానికి కారణమైందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ యవ్వారానికి సంబంధించి ఇప్పటివరకు వెలుగు చూసిన అంశాలు.. బయటకు వచ్చిన వాస్తవాలతో విజయసాయి ఉక్కిరిబిక్కిరి అయ్యారన్న భావనను ఆయన తాజా మాటలు చెప్పకనే చెప్పేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

ఎలాంటి పరిస్థితుల్లోనూ తన కుటుంబ సభ్యుల విషయాల్ని ప్రస్తావించని విజయసాయి.. తన తీరుకు భిన్నంగా తొలిసారి.. తన కుమార్తె గురించి.. అల్లుడు గురించి వివరణ ఇచ్చిన తీరు చూస్తే.. దసపల్లా ఎపిసోడ్ లో ఆయన అడ్డంగా దొరికిపోయారన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం. విశాఖలో పెద్ద ఎత్తున అక్రమ స్థలాలు కూడబెట్టినట్లుగా విజయసాయి మీద వస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు. దీనిపై ఆయన తాజాగా విరుచుకుపడిన వైనం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన వివరణ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇంతకాలం తనకు కానీ తన కుటుంబానికి కానీ విశాఖలో ఆస్తులు లేవని వాదిస్తున్న విజయసాయికి.. కుమార్తె.. అల్లుడికి చెందిన అవ్యాస్ రియల్టర్స్ సంస్థకు భోగాపురం బీచ్ కారిడార్ రెడ్డుకు పక్కనే ఉన్న భూములు.. దసపల్లా భూముల ఎపిసోడ్ లోనూ వారికి భూములు ఉన్నాయన్న మీడియా కథనాలు భారీగా రావటం.. అవి కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ఆయన మాటల్లో మార్పు స్పష్టంగా కనిపించిందన్న మాట వినిపిస్తోంది.

మంట పుట్టేలా మాట్లాడే విజయసాయి.. తన ప్రత్యర్థులు ఎక్కు పెట్టిన దసపల్లా భూములకు సంబంధించిన ఆరోపణల విషయంలో ఆయన స్పందించిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఆయన ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాంటి వాదనకు మరింత బలం చేకూరేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ తాజా ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటల్ని అండర్ లైన్ చేసుకొని మరీ చదవాల్సిందే అన్న మాట వినిపిస్తోంది. ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్లో హైలెట్ లాంటి అంశాల్ని చూస్తే..

- నా కూతుర్ని వ్యాపార సంస్థ అరబిందో యజమాని కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశా. వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె పేరు వేణుంబాక నేహా కాదు.. పెనాక నేహారెడ్డి. వారు నలబై ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నారు.
- వాళ్లింట్లో మా అమ్మాయిని ఇచ్చాక వారు సంపాదించే ఆస్తులన్నీ నావి అవుతాయా? ఆ భూములు నేను కొన్నానా?
- నా డబ్బులు ఉపయోగించి వాళ్ల పేరుతో కొన్నానా? నేను కొనుగోలుదారునీ కాదు. అమ్మకందారునీ కాదు. అందులో నా పాత్రేమీ లేదు.
- నాకు విశాఖలో ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్ మాత్రమే ఉంది. అంతకు మించి ఎలాంటి ఆస్తులు లేవు.
- చట్టప్రకారం.. కుమార్తెను ఇచ్చిన చోట వారిది ఉమ్మడి కుటుంబమై.. వారి ఆస్తులు.. వ్యాపారాలు వేరైనప్పుడు వాటిని ఆమె తండ్రి కుటుంబానికి చెందిన వారికి చట్టప్రకారం ఆపాదించకూడదు.
- ఈ రోజుకీ విశాఖకు ఎంపీని నేనే. ఈ రోజుకీ అనుకుంటే చేయగలను. చేసి చూపిస్తాను కూడా. నాకు వ్యతిరేకంగా మా పార్టీలోని వ్యక్తులే మీడియాకు సమాచారం ఇస్తున్నారన్న దానికి నా దగ్గర ఎలాంటి ఆధారాల్లేవు. రుజువులు దొరికిన రోజున తప్పనిసరిగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.