Begin typing your search above and press return to search.

మీడియా వార్ : రామోజీకి పోటీగా విజయసాయిరెడ్డి రెడీ

By:  Tupaki Desk   |   11 Oct 2022 8:38 AM GMT
మీడియా వార్ : రామోజీకి పోటీగా విజయసాయిరెడ్డి రెడీ
X
ఏపీలో సరికొత్త టీవీ చానల్ రాబోతోంది. ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత, ఎంపీ వి విజయసాయిరెడ్డి విశాఖ పాత్రికేయుల సమక్షంలో ప్రకటించారు. ఈనాడు రామోజీరావుకు కౌంటర్ ఇచ్చేందుకే తాను మీడియా రంగంలోకి రాబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఏపీలో మీడియా ఫీల్డ్ లో తన పాత్రను చూపించుకుంటానని ఆయన ఉబలాటపడుతున్నారు.

రామాజీరావు మీడియా అంతా తనను వైసీపీని నిరాధారమైన ఆరోపణనలతో నిందించడమే పనిగా పెట్టుకుంది అని ఆయన మండిపడ్డారు. అయితే ఈనాడు ను కౌంటర్ చేసేందుకు సాక్షి ఉందిగా అని ఒక విలేకరి ప్రశ్నించగా సాక్షిగా న్యూట్రల్ గా ఉంటుంది, అది వైసీపీకి చెందిన మీడియా కానే కాదని విజయసాయిరెడ్డి చెప్పడం ఇక్కడ విశేషం.

పైగా రామోజీరావు తన మీడియా ద్వారా చేసే ఆరోపణలను సాక్షిగా గట్టిగా ఖండించలేకపోతోంది అని ఆయన అభిప్రాయపడ‌డం విశేషం. అందుకే తాను మీడియా ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నట్లుగా ఆయన చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో తనకు ఒక ప్లాట్ తప్ప ఏ ఒక్క స్థలం కానీ భూమి కానీ లేదని ఆయన పేర్కొన్నారు. అయితే రామోజీరావు తన మీడియా సంస్థ ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

తన ఆస్తుల మీద సీబీఐ కాదు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో అయినా విచారణకు సిద్ధమని, చంద్రబాబు రామోజీరావు అలాంటి విచారణకు రెడీ యేనా అని ఆయన సవాల్ చేశారు. అపుడు ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రాజధాని రాకూడదనే బాగా దిగజారిపొయి నీచ ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు.

విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుని అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విషయంలో అంతా పారదర్శకంగా చేస్తే లేని పోని ఆరోపణలు చేయడమే టీడీపీ వత్తాసు మీడియా పనిగా పెట్టుకుంది అని ఆయన విమర్శించారు.

ఇవన్నీ పక్కన పెడితే ఈనాడుకు రామోజీరావుకు పోటీగా మీడియా ఫీల్డ్ లోకి వస్తానని విజయసాయిరెడ్డి రెడ్డి చెప్పడమే ఇపుడు సంచలనం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏణ్ణర్ధం వ్యవధిలో ఉన్నాయి. దాంతో విజయ‌సాయిరెడ్డి చేత ఒక మీడియా హౌజ్ ని స్థాపించేలా వైసీపీ పెద్దలే తెర వెనక ప్రోత్సహిస్తున్నారా అన్న చర్చ వస్తోంది. ఈ రోజుకు చూస్తే ఏపీలో టీడీపీకి అనుకూలంగానే ఎక్కువ మీడియా సంస్థలు ఉన్నాయి.

దాంతో వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో ఎక్కడా మీడియా విషయాన తేలిపోకూడదని, అసలు వెనకబడకూడని భావిస్తూనే ఇలా విజయసాయిరెడ్డి ద్వారా కొత్త మీడియా హౌజ్ ని ఏర్పాటు చేయిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ సరికొత్త మీడియా వార్ ఏ రేంజిలో ఉంటుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.