Begin typing your search above and press return to search.

రాజీనామాకైన సిద్ధ‌మంటున్న‌ విజ‌య‌సాయిరెడ్డి.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   28 Sep 2022 9:10 AM GMT
రాజీనామాకైన సిద్ధ‌మంటున్న‌ విజ‌య‌సాయిరెడ్డి.. కార‌ణ‌మిదే!
X
వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధ్యం కాద‌ని కేంద్రం చెప్పిందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోనే విశాఖ‌కు రైల్వే జోన్ అనే అంశాన్ని పేర్కొన్నార‌ని విజ‌య‌సాయి గుర్తు చేశారు. విశాఖ‌లో రైల్వే జోన్ ఏర్పాటు చేయ‌క‌పోతే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో రైల్వే జోన్ వైసీపీకి చెందిన ఉత్త‌రాంధ్ర నేత‌ల‌తో పాటు తాను కూడా పోరాడాన‌ని ఆయ‌న గుర్తు చేశారు. పార్ల‌మెంటులోనూ ఇదే అంశంపై ప‌లు సంద‌ర్భాల్లో కేంద్రాన్ని ప్ర‌శ్నించాన‌ని వెల్ల‌డించారు.

కాగా తాజాగా విభ‌జ‌న అంశాల‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర హోం శాఖ సెప్టెంబ‌ర్ 28న ఢిల్లీలో తాజాగా స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో విశాఖ రైల్వే జోన్ ఫీజుబిలిటీ సాధ్యం కాద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి తాజాగా స్పందించారు.

రెండు రాష్ట్రాల అధికారుల‌తో కేంద్రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఏపీ రాజ‌ధాని నుంచి కోవూరు మీదుగా తెలంగాణ‌కు రైల్వే లైన్ అనే అంశంపైనే చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. గ‌తంలోనూ ఇదే విష‌యంపై చ‌ర్చ జ‌రిగింద‌ని విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేశారు. కాగా ఇందులోనే రైల్వే జోన్ అంశం చ‌ర్చ‌కు రాగా కేంద్ర రైల్వే బోర్డు విశాఖ రైల్వే జోన్ ఫీజబిలిటీ లేదంటూ స్ప‌ష్టం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి స్పందించి ఈ విష‌యాన్ని కేంద్రం నిర్ణ‌యానికే వ‌దిలేద్దామ‌ని చెప్పిన‌ట్టు ప్ర‌సార మాధ్య‌మాలు పేర్కొన్నాయి.

అయితే ఈ వార్త‌ల‌ను విజ‌య‌సాయిరెడ్డి ఖండించారు. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ నిర్వ‌హించిన స‌మావేశంలో రైల్వే జోన్ అంశం అస‌లు చర్చ‌కే రాలేద‌న్నారు. అసలు మంగళవారం జరిగిన సమావేశ:లో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదన్నారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో విశాఖ రైల్వే జోన్‌ను చేర్చార‌ని.. పార్ల‌మెంటులో కూడా చ‌ట్టం చేశార‌ని గుర్తు చేశారు. ఇంత జ‌రిగాక అందులో మార్పు ఉండబోద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విశాఖ‌ప‌ట్నంలో రైల్వే జోన్ చెప్పుకొస్తుంద‌న్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామాకైనా సిద్ధ‌మేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రోవైపు విశాఖ‌ రైల్వే జోన్ అంశంపై బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా స్పందించారు. విశాఖ‌ రైల్వే జోన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని తేల్చిచెప్పారు.

ఇప్ప‌టికే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటు ప‌రం చేస్తోంద‌ని ఉద్యోగులు, కార్మిక సంఘాలు, వివిధ పార్టీలు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్రం రైల్వే జోన్ విశాఖ‌లో ఏర్పాటు చేయ‌కుంటే ఈ వివాదం మ‌రింత పెద్ద‌ద‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇంకోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం విశాఖ‌లో ప‌రిపాల‌న రాజధాని అని చెబుతోంది. ఈ నేప‌థ్యంలో విశాఖ చుట్టూ ఏపీ రాజ‌కీయాలు కేంద్రీకృత‌మై ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.