Begin typing your search above and press return to search.

ఫీల్డ్ లోకి దిగిపోతున్న విజయసాయిరెడ్డి... ?

By:  Tupaki Desk   |   26 Feb 2022 12:30 AM GMT
ఫీల్డ్ లోకి దిగిపోతున్న విజయసాయిరెడ్డి... ?
X
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ యాక్టివిటీస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఉత్తరాంధ్రా మూడు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటనలు చేయబోతున్నారు. దాదాపు మూడేళ్ళ అధికారం తరువాత పార్టీ పరిస్థితి ఏంటో కళ్లారా చూడబోతున్నారు. చెవులారా పార్టీ జనాలు చెప్పేది వినబోతున్నారు. ఆయన అణువణువూ పట్టి మరీ అధినాయకత్వానికి సమగ్రమైన నివేదికను ఇస్తారని తెలుస్తోంది.

వైసీపీలో కీలకమైన నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రా మూడు జిల్లాలలోని బాధ్యతలను చాలా ఏళ్ళుగా చూస్తున్నారు. అయితే ఆయన ఇంతవరకూ విశాఖ కేంద్రంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారు. అక్కడే పూర్తి సమయం కేటాయించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీకి బడా నేతలు ఉన్నారు, వారే అన్ని విషయాలూ చూసుకునేవారు. ముఖ్యమైన కార్యక్రమాలకే విజయసాయిరెడ్డి ఈ జిల్లాలకు వచ్చేవారు.

అయితే వైసీపీ పాలనలో పుణ్యకాలం మెల్లగా కరిగిపోతోంది, దాంతో సర్కార్ మీద వ్యతిరేకత మెల్లగా వస్తోంది. ఇక పార్టీ పరంగా చూసుకున్నపుడు ఏ జిల్లాలోనూ సవ్యంగా పరిస్థితి అయితే లేదు. ఎటు చూసినా కుమ్ములాటలే ఉన్నాయి. అదే విధంగా ఎమ్మెల్యేలకు, నాయకులకు మధ్య విభేధాలు ఉన్నాయి.

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చారని కూడా వారు గుస్సా అవుతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయన్న దాన్ని కూడా ఆరా తీసి అంచనాకు వస్తారని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా ముఖద్వారం అయిన శ్రీకాకుళం జిల్లా నుంచే విజయసాయిరెడ్డి నియోజకవర్గాల పర్యటన త్వరలో మొదలవుతుంది అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఉన్న మొత్తం ముప్పయి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన పర్యటిస్తారు అని చెబుతున్నారు.

ఒక వైపు ఎమ్మెల్యేలతోనూ, మరో వైపు నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా భేటీలు వేసి పార్టీ రియల్ పిక్చర్ ఏంటి అన్నది ఆయన తెలుసుకుంటారని అంటున్నారు. దీన్ని అధినాయకత్వానికి నివేదిక రూపంలో ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి మార్చి నెలలో విజయసాయిరెడ్డి టూర్లు ఉంటాయని చెబుతున్నారు.