Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోర్ టీం ఎంపీ అత్త‌...స‌ర్పంచి పీఠంపై

By:  Tupaki Desk   |   14 Jan 2019 6:47 AM GMT
కేసీఆర్ కోర్ టీం ఎంపీ అత్త‌...స‌ర్పంచి పీఠంపై
X
తెలంగాణ రాజ‌కీయల్లో ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల పోరులో తాజాగా పంచాయ‌తీ స‌మ‌రం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో అనేక ప‌ద‌నిస‌లు క‌నిపిస్తున్నాయి. తాజాగా, మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోర్ టీంలో క్రియాశీలంగా ఉండే ఓ సీనియ‌ర్‌ ఎంపీ అత్త స‌ర్పంచి పీఠం అధిరోహించారు. అదే స‌మ‌యంలో ఓ ఎమ్మెల్యే స‌తీమ‌ణి కూడా స‌ర్పంచి పీఠం ఎక్కారు. ఆ ఎంపీ...క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు స‌భ్యులు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ కాగా, ఎమ్మెల్యే గ‌ద్వాల శాస‌న‌స‌భ్యులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.

వివ‌రాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ సర్పంచ్‌ గా కరీంనగర్ ఎంపీ వినోద్‌ కుమార్ అత్త చెన్నాడి రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పదిమంది వార్డుసభ్యులను ఆదివారం గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరెం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చెన్నాడి రాజ్యలక్ష్మితోపాటు మరో నలుగురు నామినేషన్లు దాఖలుచేశారు. ఆదివారం రాజ్యలక్ష్మి మినహా మిగతావారు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఉమారాణి ప్రకటించి.. ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రాజ్యలక్ష్మికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

మ‌రోవైపు, జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండంలోని బురెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి సతీమణి జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే స్వగ్రామం బురెడ్డిపల్లి పంచాయతీని జనరల్ మహిళకు కేటాయించగా ఆరుగురు నామినేషన్లు దాఖలుచేశారు. వీరంతా ఎమ్మెల్యేకు సమీప బంధువులే. వారంతా గ్రామాభివృద్ధిని కాంక్షించి జ్యోతికి అవకాశం ఇచ్చి బరిలో నుంచి తప్పుకోవడంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.