Begin typing your search above and press return to search.

కేసులు ఎత్తివేయాలని ఏడాది తర్వాత లేఖ రాశారు

By:  Tupaki Desk   |   9 Jun 2015 4:35 AM GMT
కేసులు ఎత్తివేయాలని ఏడాది తర్వాత లేఖ రాశారు
X
నిత్యం తెలంగాణ ప్రజల కోసమే తాను ఉన్నట్లు.. వారి ఆత్మగౌరవానికి.. వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా తాను ఊరుకోనని.. ఉగ్రనరసింహావతారం ఎత్తుతానని చెప్పే తెలంగాణ ప్రభుత్వం చెప్పే మాటల్ని వినటం మానేసి.. చేతల్ని ఒకసారి చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన పలు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి వేలాది కేసులు నమోదయ్యాయి. వీటిల్లో రైల్వేశాఖ పెట్టిన కేసులు భారీగా ఉన్నాయి. ఉద్యమంలో పాల్గన్న దానికి బదులుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసులు మెడకు వేలాడుతున్న పరిస్థితి.

మిగిలిన విషయాల్లో జాప్యం అర్థం చేసుకోవ్చు కానీ.. ఉద్యమకారుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే కేసుల వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పాటు అయి ఏడాది అవుతున్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్వేశాఖ పెట్టిన కేసులకు సంబంధించి తాజాగా లేఖ రాయటానికి తెలంగాణ ఎంపీకి సమయం చిక్కింది.

ఒకవిధంగా చూస్తే టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ను అభినందించాలి. రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా భారీగా పండగలు చేసుకున్నారే తప్పించి.. ఉద్యమ సమయంలో పోరాడిన వారి నెత్తిన ఉన్న కేసుల్ని తీసేసే విషయం మీద ఇంకా దృష్టి పెట్టింది లేదు. తెలంగాణ అధికారపక్ష ఎంపీ లేఖ రాసే బదులు.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తన స్థాయిలో కేసులు ఎత్తి వేయాలన్న ఒత్తిడిని కేంద్రం మీదకు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రత్యేక పరిస్థితుల్లో.. ప్రత్యేకంగా చేసిందన్న విషయం మర్చిపోకూడదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రం నుంచి ప్రత్యేక మినహాయింపు తీసుకొని.. రైల్వేశాఖ నమోదు చేసిన కేసుల నుంచి ఉద్యమకారులను విముక్తి చేయాల్సి ఉంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఈ పని చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకూ అలాంటివేమీ జరగకపోవటం శోచనీయం. ఎంపీగా వినోద్‌కుమార్‌ పరిమిత హోదా కాకుండా.. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సర్కారు కేసుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది.