Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లో ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ

By:  Tupaki Desk   |   4 Oct 2021 6:30 AM GMT
టీఆర్ఎస్ లో ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ
X
ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం జరిగిన మధిర నియోజకవర్గస్థాయి సభ టీఆర్ఎస్ నాయకుల్లో వర్గ విభేదాలను బయటపెట్టాయి. పార్టీలో వర్గాలు లేవని.. అంతా ఒక్కటేనని అధినాయకత్వం చెబుతున్నా.. జిల్లాలో ఎవరికి వారు అన్న విషయం మధిర సభలో తేటతెల్లమైంది.

మాజీ ఎంపీ , ప్రస్తుత ఎంపీల మధ్య పదవులు, బ్రాండ్ల విషయంలో ఆవేశపూరిత వ్యాఖ్యలు సాగాయి. తాజాగా మధిరలో జరిగిన సభలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పార్టీలో వర్గాలు, కులాలు లేవని.. నిబద్ధతతో పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయని’ అన్నారు.

అంతకుముందు మాట్లాడిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ‘మధిరలో శీనన్న బ్రాండ్ ఉంది. నేను ఎక్కడికైనా.. ఎప్పుడైనా వెళ్తా.. పార్టీ సమావేశాలకు ఎక్కడికైనా ఎవరైనా నాయకులు హాజరు కావచ్చు. అంతేకానీ.. ఫలానా నాయకుడి వెంట వెళ్లి పదవులు తీసేస్తానని చెప్పడం సరికాదు ’ అని వ్యాఖ్యానించారు.

దీనిపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందిస్తూ ‘పార్టీలో ఎవరి బ్రాండ్ లేదు. ఉన్నదంతా కేసీఆర్ బ్రాండే.. జిల్లాలో టీఆర్ఎస్ కు ఎంతో బలం ఉంది. వరాలు, కులాలు ఏమీ లేవు. పదవులు రానివాళ్లకు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు. ఈ నేతల వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇదే సభలో నేతలు తమ ఐక్యతను చాటుతూ అభివాదం చేయడం గమనార్హం.

ఇలా సొంత పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఒకే పార్టీలో ఉంటూ అసమ్మతి రాజేస్తున్నారు. ఎంపీ, మాజీ ఎంపీల పరస్పర భిన్నమైన వాదనలు టీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి.