Begin typing your search above and press return to search.

ఆమె కుర్చీలో ఆయన పెత్తనం.. వావ్.. వాటే సీన్

By:  Tupaki Desk   |   9 Aug 2022 2:30 PM GMT
ఆమె కుర్చీలో ఆయన పెత్తనం.. వావ్.. వాటే సీన్
X
మహిళలకు రాజ్యాధికారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించి మరీ.. వారిని ప్రజాజీవనంలోకి తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలు అప్పుడప్పుడు నవ్వుల పాలు అవుతుంటాయి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. బరితెగింపునకు కేరాఫ్ అడ్రస్ అన్న రీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

చుట్టూ అధికారులు.. మీడియా ఉన్నప్పటికీ.. వాటినేమీ పట్టించుకోకుండా తన స్థాయిని చూపించేందుకు ఒక నేత చూపించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ అసలేం జరిగిందంటే..

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అచ్యుత జానకి అధ్యక్షతన మండల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె పక్కనే కూర్చున్న ఎంపీపీ అయిన ఆమె భర్త రాంబాబు.. తనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా అధికారులతో పాటు సభా వేదిక మీదనే కూర్చున్నారు.

అక్కడితో ఆగక ఆయన.. వివిధ శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించటం విమర్శలకు తావిచ్చింది.

అసలు ఎలాంటి అధికారిక హోదా లేకున్నా సమావేశంలో రాంబాబు ఎందుకు పాల్గొన్నారు?అలాంటి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అధికారులు ఏం చేశారు? ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరును ఎందుకు నియంత్రించలేకపోయారు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాంబాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి తీరును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.