Begin typing your search above and press return to search.

ట్వీట్ తో పన్నీర్ కు మంత్రి మద్దతు

By:  Tupaki Desk   |   11 Feb 2017 9:51 AM GMT
ట్వీట్ తో పన్నీర్ కు మంత్రి మద్దతు
X
తమిళనాడు రాజకీయాలు అంతకంతకూ ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూపలువురు ఎమ్మెల్యేలు ఆయన పక్షాన చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు.. ఆయన వర్గంలోకి ఇద్దరు ఎంపీలు వచ్చేశారు. ఇప్పటివరకూ పన్నీర్ కు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందనుకుంటే.. అందుకు భిన్నంగా ఎంపీలు కూడా పన్నీర్ బాట పట్టటం విశేషం.

ఇది సరిపోదన్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పాండ్య రాజన్ ఆసక్తికర రీతిలో వ్యవహరించారు. తాను ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తానని.. అందుకు తగ్గట్లే తన నిర్ణయం ఉంటుందన్న విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభం విషయంలో పలువురు శశికళను తప్పు పట్టటం.. పన్నీర్ కు పట్టం కట్టాలంటూ పెద్ద ఎత్తునప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి చిన్నమ్మ అర్హురాలు కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తుననిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి వేళ.. సోషల్ మీడియాలో స్పందించిన మంత్రి.. తన మద్దతు విషయమైన నర్మగర్భంగా చెప్పటం గమనార్హం. శశికళను వ్యతిరేకిస్తూ.. ప్రజాప్రతినిధుల ఫోన్లకు కాల్స్ చేయటం.. లేదంటే మెసేజ్ ల రూపంలో ప్రజలు ఎవరికి తమ మద్దతు ఇచ్చేది.. వారి వారి ఎమ్మెల్యేలకు ప్రజలు చెప్పాలంటూ ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆన్ లైన్ లో జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తున్న వారిలో మెజార్టీ పన్నీర్ వైపునే ఉండటం గమనార్హం. ఇలాంటి వేళ శశికళ వర్గానికి చెందిన మంత్రి.. ట్వీట్ రూపంలో తన మద్దతును ప్రకటించటం ఒక విశేషమైతే.. ఇదే విధానాన్ని మిగిలిన శశి వర్గంలోని ఎమ్మెల్యేలు అనుసరిస్తే.. చిన్నమ్మకు చిక్కులేనని చెప్పక తప్పదు.