Begin typing your search above and press return to search.

ఎంపీల‌కు శాల‌రీ హైక్‌

By:  Tupaki Desk   |   19 July 2016 5:15 AM GMT
ఎంపీల‌కు శాల‌రీ హైక్‌
X
ఎంపీల జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయి. త్వ‌ర‌లో అవి రెట్టింపయ్యే సూచ‌న‌లున్నాయి. ఈ మేర‌కు జీతాల పెంపుపై ఎంపీల కమిటీ - మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర మంత్రివ‌ర్గం ప‌రిశీల‌న‌కు పంపారు. ఈ ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించాల్సి ఉంది. ఈ సిఫారసులు ప్ర‌స్తుత‌ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

కాగా ఎంపీల జీతాల పెంపు అంశం పార్లమెంట్ ఆమోదం పొందితే వారి వేత‌నాలు రెట్టింప‌వుతాయి. పెంచిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ట‌. అంటే బ‌కాయిలు కూడా భారీగానే అందుతాయ‌న్న‌మాట‌.కొత్త వేతనాల ప్రకారం ఎంపీ నెల జీతం రూ. లక్షకు చేరుతుంది. నియోజకవర్గ అలవెన్స్ లు - ప్రయాణ - ఇతర అలవెన్స్ లు రూ.90 వేలకు చేరతాయి.

ఎంపీల వార్షిక ఫర్నీచర్ అలవెన్స్ లు కూడా రెట్టింపు కానున్నాయి. అంతేకాకుండా - ఎంపీల సిబ్బంది జీతాలు - మాజీ ఎంపీల నెలవారీ పింఛన్ కూడా పెరగనుంది. మాజీ ఎంపీల పింఛన్ రూ.20 వేల నుంచి రూ.35 వేలకు పెరుగుతుందని తెలుస్తోంది. కొత్త జీతాలు అమల్లోకి వస్తే దాదాపు 800 మంది ప్రజాప్రతినిధుల మూలవేతనం రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు చేరుతుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు ఇప్ప‌టికే పెంచారు. దీంతో ప్ర‌జా ప్ర‌తినిధుల జీతాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అయితే.. ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు స‌భ‌ల‌కు హాజ‌ర‌వుతున్న తీరుపై మాత్రం విమ‌ర్శ‌లున్నాయి. భారీగా జీతాలు అందుకుంటున్న ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మాత్రం గాలికొదిలేసి ప్ర‌భుత్వం క‌ల్పించే ప్ర‌యోజ‌నాల‌ను మాత్రం పొందుతున్నార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. పార్ల‌మెంటుకు వెళ్ల‌క‌పోవ‌డం.. వెళ్లినా కాసేపు కూర్చుని వ‌చ్చేయ‌డం త‌ప్ప చ‌ర్చ‌ల్లో పాల్గొని, ప్ర‌శ్న‌లు వేసేవారు త‌క్కువ‌గా ఉంటున్నారు. దీంతో వారికి ఇంతింత జీతాలు అవ‌స‌ర‌మా అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.