Begin typing your search above and press return to search.

వైసీపీలో.. ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు.. ఢీ అంటే ఢీ ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   20 Sep 2021 6:04 AM GMT
వైసీపీలో.. ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు.. ఢీ అంటే ఢీ ఎందుకో తెలుసా?
X
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాల 4 నెలలు అయింది. అంటే.. ప్ర‌జ‌లు ఇచ్చిన స‌మ‌యంలో దాదాపు స‌గం అయిపోయింది. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఇంత కాలం గ‌డిచిపోయినా.. అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేద‌ని చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌.. ఆయ‌న కుటుంబం ప‌డిన క‌ష్టాన్ని చూసి.. ప్ర‌జ‌లు ఎంపీల‌ను, ఎమ్మెల్యేల‌ను భారీ సంఖ్య‌లో గెలిపించారు. అయితే.. ఇప్పుడు వీరు మాత్రం.. అంతా మాదే.. అంతా మేమే అనే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అయోధ్య కుద‌ర‌డం లేద‌ని అనుకుంటున్నారు. అయితే.. వీరిని నిశితంగా ప‌రిశీలిస్తున్న వారు.. మాత్రం ఇది ఒక్క‌టే కార‌ణం కాద‌ని చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి 22 మంది ఎంపీలను, 151 మంది ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ వ‌చ్చే స‌రికి వైసీపీ ఎంపీల‌కు ప‌నిలేకుండా పోయింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పోనీ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుదామంటే.. ఎమ్మెల్యేలు అస‌లు రానీయ‌డం లేద‌నిచెబుతున్నారు. ఈ విష‌యంపై అస‌లు ఏం జ‌రుగుతోంద‌ని `తుపాకీ` ప‌రిశీలించింది. దీంతో అస‌లు విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి.

2019 ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు కూడా దాదాపు ఎంపీ అభ్య‌ర్థ‌ల్లో 80 శాతం మంఇ ఎన్నిక‌ల‌కు 100 రోజ‌లు ముందు మాత్ర‌మే వైసీపీలో చేరారు. ఈ క్ర‌మంలో వీరు వైసీపీవ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిశోర్‌కు, పార్టీ అధినేత జ‌గ‌న్‌కు నేరుగా ట‌చ్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే హైక‌మాండ్‌కు నిధులు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఈ డ‌బ్బుల‌నే హైక‌మాండ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు నిధుల రూపంలో ఇచ్చింద‌ట‌. అయితే.. ఎమ్మెల్యేలు మాత్రం మాకు పార్టీ ఇచ్చింది కానీ, ఎంపీలు ఇవ్వ‌లేదు.. అని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంపీల‌కు ఎందుకు మ‌ర్యాద ఇవ్వాల‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎంపీల‌ను పూచిక పుల్ల‌ల‌తో స‌మానంగా చూస్తున్నార‌ని తెలిసింది.

క‌నీసం ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడు ఎంపీల‌కు క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేద‌ని తెలిసింది. అదేంటి? అని ఎంపీలు ప్ర‌శ్నిస్తే.. హైక‌మాండ్‌కు చెప్పుకొండి.. మాకు నిధులు ఇచ్చింది హైక‌మాండ్, మీరు ఇచ్చింది కూడా హైక‌మాండ్‌కే క‌దా.. వాళ్ల‌ద‌గ్గ‌ర‌కే వెళ్లండి అని చెబుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలో పోనీ.. హైక‌మాండ్‌కు త‌మ బాధ‌ను చెప్పుకోవాల‌ని చూస్తే.. వీరికి అస‌లు అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని తెలిసింది. దీంతో ఎమ్మెల్యేల‌కు అప్పాయింట్‌మెంట్స్ ఇస్తున్నారు.. ప‌ట్టించుకుంటున్నారు. మ‌మ్మ‌ల్ని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.. అని వీరు వాపోతున్నారు.

హైక‌మాండ్ త‌మ‌ను కేవ‌లం పార్ల‌మెంటు స‌మావేశాల‌కు ముందు మాత్ర‌మే పిలిచి పార్ల‌మెంటులో ఎలా వ్య‌వ‌హ‌రించాలో చెప్పి చేతులు దులుపుకొంటోంద‌ని.. తాము చెబుదామ‌నుకున‌న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. దీంతో ఎమ్మెల్యేల‌కు కూడా ఈ విష‌యం తెలిసి.. త‌మ‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. నియోజ‌క‌వ‌ర్గాల్లోకి కూడా రానీయ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు హైక‌మాండ్ మీద ఎదురు తిరిగి రోజూ.. సొంత పార్టీ మీద విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని తెలిసింది.

మ‌రోవైపు.. అన్ని జిల్లాల్లోనూ ఎంపీతో ఎమ్మెల్యేల‌కు స‌రిపోవ‌డం లేదు. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు, ఎమ్మెల్యే జ‌క్కం పూడి రాజాకు.. మ‌ధ్య వివాదం రోడ్డెక్కింది. ఆది నుంచి ఈ ఇద్ద‌రికి ప‌డ‌డం లేదు. ఓ ద‌ళిత టీచ‌ర్‌పై ప్ర‌సాద్‌రాజు అనే వ్య‌క్తి దాడి చేసిన ఘ‌ట‌న‌.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత రాజ‌కీయం రాజేసింది. దీంతో ఇద్ద‌రు కూడా నువ్వా.. నేనా అనేరేంజ్‌లో స‌వాళ్లు విసురుకుంటున్నారు. అనంత‌పురంలో ఎంపీ త‌లారి రంగ‌య్య‌కు.. ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌రణ్‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎలా వ‌స్తారంటూ.. రంగ‌య్య‌ను ఉష‌శ్రీ నిల‌దీసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

అదేవిధంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ వ‌ర్సెస్ స్థానిక ఎమ్మెల్యేల‌కు కూడా ప‌డ‌డం లేదు. ఇక‌, విశాఖ ప‌ట్నం ఎంపీ.. అస‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఈయ‌న‌కు ఎమ్మెల్యేల‌తోకాదు.. పార్టీ నేత‌ల‌తోనూ ప‌డ‌డం లేదు. అదేవిధంగా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌.. న‌ర‌సారావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌కు కూడా ఎమ్మెల్యేల నుంచి బాగానే సెగ‌తగులుతోంది. మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. బీజేపీలోకి ట‌చ్‌లోకి వెళ్లే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఎంపీలు అంటున్నారు. మ‌రి ఇంత సీరియ‌స్ విష‌యాన్ని హైక‌మాండ్ ఎలా సాల్వ్ చేస్తుందో... లేకుంటే లైట్ తీసుకుంటుందో చూడాలి.

ఈ ఆర్టిక‌ల‌పై మీ ద‌గ్గ‌ర ఇంకా స‌మాచారం ఉంటే.. కామెంట్ రూపంలో పంపండి. నిజ‌మైన స‌మాచారం అయితే.. ఈ ఆర్టిక‌ల్‌ను ప్ర‌చారం చేస్తామ‌ని తుపాకీ త‌న పాఠ‌కుల‌కు చెబుతోంది.