Begin typing your search above and press return to search.

కారుకు పదహారు వస్తే.. జూన్ లో మళ్లీ ఎన్నికలు

By:  Tupaki Desk   |   7 April 2019 4:42 AM GMT
కారుకు పదహారు వస్తే.. జూన్ లో మళ్లీ ఎన్నికలు
X
పైకి అంతా బాగున్నట్లుగా కనిపిస్తుంది కానీ తరచి చూస్తే కానీ అసలు విషయం అర్థం కాక మానదు. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ.. అన్న పద్యాన్ని గుర్తుకు తెచ్చేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఉందన్న తీవ్ర విమర్శ వినిపిస్తూ ఉంటుంది. దాదాపు ఏడాది నుంచి తెలంగాణలో పాలన పడకేసిందని.. ఆ మాటకు వస్తే.. రానున్న మరో ఆర్నెల్ల వరకూ అలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా చెప్పక తప్పదు.

ప్రతిపక్షాల పేరుతో తనకు నచ్చినట్లుగా ముందస్తు ఎన్నికలు నిర్వహించిన కేసీఆర్ పుణ్యమా అని.. గడిచిన ఏడాది నుంచి పాలన పడక వేసిందని చెప్పక తప్పదు. మీరు గుర్తుకు తెచ్చుకుంటే.. ఒక కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు సెంటిమెంట్ ను రగిలిస్తూ ప్రజల్ని పాలన మీద కాకుండా వేరే అంశాల మీద ఫోకస్ చేసేలా కేసీఆర్ పనులు ఉంటాయని చెప్పాలి.

ఐదేళ్ల పాలనను పక్కన పెట్టి.. శాంపిల్ గా ఆ మధ్యన నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభల దగ్గర నుంచి చూడండి. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పటం.. లేదంటే.. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా ఏదో ఒకటి చేస్తున్నట్లుగా ప్రచారమే తప్పించి.. మిగిలినవేమీ కనిపించని పరిస్థితి. గత ఏడాది ఆగస్టు నుంచి పాలన అన్నది రాష్ట్రంలో లేదు. మీడియాలో ముందస్తు ఎన్నికల మీద వార్తలు రావటం.. దానిపైనే అందరి చూపు పడటం.. మీడియాలో చెప్పినట్లే కేసీఆర్ ముందస్తుకు వెళ్లటం.. ఆ ఎన్నికల హడావుడి జనవరి వరకూ సాగితే.. ఫిబ్రవరి లో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చిలో నోటిఫికేషన్. ఎన్నికల హడావుడి మే చివరి వరకూ సాగుతుంది. ఒకవేళ కేసీఆర్ కోరుకునట్లే కారుకు పదహారు సీట్లు సొంతమైతే.. ఆ వెంటనే మరో ఎన్నికలకు వెళ్లటం ఖాయమంటున్నారు.

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ.. జడ్పీటీసీల ఎన్నికలను నిర్వహిస్తే.. రానున్న కొన్నేళ్ల వరకూ ఎన్నికల మాటే వినిపించని పరిస్థితి. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే జూన్ లోనే ఎంపీటీసీ..జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లటం ద్వారా.. రాజకీయంగా తమకు తిరుగులేదన్న విషయాన్ని స్పష్టం చేస్తారు. అదే సమయంలో కేసీఆర్ కోరుకున్నట్లే కేంద్రంలోనూ ఫలితాలు వస్తే.. ఆయన చూపు అంతా ఢిల్లీ మీదనే ఉంటుంది. ఢిల్లీ లో చక్రం తిప్పాలని తపిస్తున్న కేసీఆర్ ఆ పనిలో భిజీగా ఉంటే తెలంగాణ పరిస్థితి ఏమిటి? అన్నది క్వశ్చన్.

ఒకవేళ కేసీఆర్ కోరుకున్నట్లు 16 సీట్లు రాని పక్షంలో.. జూన్ లో జరగాల్సిన ఎంపీటీసీ.. జెడ్పీసీటీ ఎన్నికలు కొద్ది కాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు. మరి.. మరో ఎన్నికలకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని భావిస్తున్నారా? లేక బ్యాక్ టు బ్యాక్ వస్తున్న ఎన్నికలకు కొంతకాలం కామా పెట్టాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కాలమే బదులివ్వాలి.