Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖుల సొంతూళ్ల‌లో స్థానికులు షాకిచ్చారు!

By:  Tupaki Desk   |   5 Jun 2019 6:25 AM GMT
ప్ర‌ముఖుల సొంతూళ్ల‌లో స్థానికులు షాకిచ్చారు!
X
తాజాగా వెల్ల‌డైన తెలంగాణ జెడ్పీటీసీ.. ఎంపీటీసీ స్థానాల ఫ‌లితాల్లో కొన్ని ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌ముఖుల‌కు చెందిన అడ్డాల్లో స్థానికులు వారికి షాకిచ్చేలా తీర్పులు ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా షాకులు త‌గిలిన వారిలో తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌ల‌తో పాటు.. ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు ఉండ‌టం విశేషం.

మాజీ మంత్రి క‌మ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి మ‌రో షాక్ త‌గిలింది. ఇటీవ‌ల ఓట‌మి వేద‌న నుంచి రీసెంట్ ఎమ్మెల్సీ విజ‌యం ఆయ‌న‌కు ఊర‌ట‌నిస్తే.. తాజాగా ఎదురైన అనూహ్య ప‌రిణామం ఆయ‌నకు ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పాలి. మ‌హేంద‌ర్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లం గొల్లూర్ గూడ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా గులాబీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మైన ఇల్లెందు ఎమ్మెల్యే హ‌రిప్రియ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. తాజాగా ఆమె టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు తెలిపినా.. స్థానికులు ఆమెకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. పార్టీ మారే విష‌యంలో ఆమె తీసుకున్న నిర్ణ‌యంపై గుర్రుగా ఉన్న స్థానికులు టీఆర్ఎస్ అభ్య‌ర్థిని ఓడిస్తూ ఓటేశారు. ఈ స్థానంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌టం విశేషం.

ఇదిలా ఉంటే.. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం సొంతూరు ఖ‌మ్మం జిల్లా తెల్ణారుప‌ల్లి. అక్క‌డ సీపీఎం అభ్య‌ర్థిపై స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌కు సంబంధించిన మెజార్టీల‌ను చూస్తే.. చాలా స్వ‌ల్ప అధిక్య‌త రావ‌టం క‌నిపిస్తుంది. ఎంపీటీసీల‌తో పోలిస్తే.. జెడ్పీటీసీ అభ్య‌ర్థుల మెజార్టీలు కాస్త మెరుగ్గా ఉంది.

ఇదిలా ఉంటే.. రాష్ట్రం మొత్త‌మ్మీదా జెడ్పీటీసీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన వారిలో తెలంగాణ రాష్ట్రంలో అత్య‌ధిక మెజార్టీని సాధించిన నేత‌గా కొనేరు కృష్ణారావు నిలిచారు. టీఆర్ ఎస్ నేత‌.. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప సోద‌రుడే కృష్ణారావు. కాంగ్రెస్ అభ్య‌ర్థి య‌ల‌మంచిలి జ‌గ‌దీశ్ పై టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఏకంగా 12438ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత భారీ మెజార్టీ మ‌రే అభ్య‌ర్థికి రాలేదు.