Begin typing your search above and press return to search.

పార్లమెంటు ఎన్నికకు ఇది ట్రైలరేనా ?

By:  Tupaki Desk   |   3 April 2021 2:30 AM GMT
పార్లమెంటు ఎన్నికకు ఇది ట్రైలరేనా ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని దూకుడుమీదున్నారు. ఉరుములేని పిడుగు లాగ ఈనెల 8వ తేదీన పెండింగ్ లో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించేస్తున్నారు. గురువారం రాత్రి షెడ్యూల్ ను ప్రకటించి సాహ్ని రాజకీయపార్టీలకు పెద్ద షాకే ఇచ్చారు. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు పూర్తియిన తర్వాతే పరిషత్ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలు అనుకున్నాయి.

అయితే ఎవరు ఊహించని విధంగా హఠాత్తుగా షెడ్యూల్ ను ప్రకటించటంతో పార్టీలు బిత్తరపోయాయి. ఇప్పటికే పాత నోటిఫికేషన్ తో జరగబోయే ఎన్నికలను టీడీపీ బహిష్కరించేట్లుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా టీడీపీ ఇంకా ప్రకటించలేదు. కాబట్టి మిగిలిన పార్టీల సంగతి సస్పెన్సులో పడింది. ఒకవేళ టీడీపీనే పోటీకి దూరమైపోతే ఇక మిగిలిన పార్టీల సంగతి మాట్లాడటమే అనవసరం.

ఇవన్నీ ఇలాగుంటే ఈనెల 8వ తేదీన జరగబోయే పరిషత్ ఎన్నికలు 17వ తేదీన జరగబోయే తిరుపతి పార్లమెంటుకు ట్రైలర్ లాగ ఉండబోతోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రతిదానిలోను కనీసం 10 జడ్పీటీసీలు, అంతకుమించి ఎంపిటీసీలుంటాయి.

అంటే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి జనాల మద్దతుంటుందనే విషయం పరిషత్ ఎన్నికల్లో తెలిసిపోయే అవకాశం ఉంది. మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనే ఈ విషయంపై అందరిలోను క్లారిటి వచ్చేసింది. అయితే అప్పటికి లోక్ సభ ఉపఎన్నికపై ఎవరికీ క్లారిటి లేదు. అలాంటిది ఈనెల 17వ తేదీన ఉపఎన్నిక జరగనుండటం, దానికన్నా ముందే పరిషత్ ఎన్నికలు జరుగుతుండటంతో ఎంపి ఎన్నికకు పరిషత్ ఎన్నికలు ట్రైలర్ లాగ అనిపిస్తోంది.