Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ ఎమ్మార్వో?

By:  Tupaki Desk   |   3 Aug 2019 5:55 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ ఎమ్మార్వో?
X
వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఏపీ యువ సీఎం జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక వైసీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అంతే దూకుడుగా ముందుకెళ్తుండడం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రాత్రికి రాత్రే అన్నీ అయిపోవాలన్న చందంగా కొత్త ఎమ్మెల్యేలు మంకు పట్టు పట్టడం అధికారులను ఇరుకునపెడుతోంది.

తాజాగా ఓ ఎమ్మెల్యే, ఓ తహసీల్దార్ మధ్య ఇదే వ్యవహారం చిచ్చు పెట్టింది. పబ్లిక్ గానే వాదులాడుకునేదాక వెళ్లింది. ఎమ్మెల్యే పైనే తిరగబడ్డ ఓ ఎమ్మార్వో వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో తాజాగా జలశక్తి అభియాన్ కార్యక్రమం జరిగింది.దీనికి స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లాపల్లి తహసీల్దార్ బి. బాలక్రిష్ణ తోపాటు జేసీ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అధికారుల తీరును తప్పుపట్టారు. 965మంది రైతుల సర్వే నంబర్లు ఆన్ లైన్ చేయాల్సి ఉండగా.. 300మందివి మాత్రమే చేశారని.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

ఇదే వేదికపై ఉన్న తహసీల్లార్ బాలక్రిష్ణ ఎమ్మెల్యే మాటలను ఖండించారు. తాను వచ్చి రెండు నెలలే అవుతోందని.. ఆ రికార్డులపై అవగాహన లేదని.. గవర్నర్, ప్రభుత్వం నుంచి 10 సార్లు ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్న తనపై నిందలు వేస్తారా అంటూ ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. మీకు ఇష్టం లేకపోతే ట్రాన్స్ ఫర్ చేసుకొని వెళ్లిపోతానని స్పష్టం చేశారు.

ఇలా వైసీపీ ఎమ్మెల్యే దూకుడు.. ఒక్కరోజులోనే పనులన్నీ అయిపోవాలన్న తొందర ఇప్పుడు అధికారులను ఇరుకునపెడుతోంది. అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేయడం లేదన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా రైలుపట్టాల లాగా పనిచేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి గొడవలు పెట్టుకోవడం పాలనపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.