Begin typing your search above and press return to search.

జడేజా.. అంత పనిచేశావేం.. మళ్లీ ధోనీనే దిక్కనేలా..

By:  Tupaki Desk   |   1 May 2022 8:23 AM GMT
జడేజా.. అంత పనిచేశావేం.. మళ్లీ ధోనీనే దిక్కనేలా..
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కెప్టెన్ ను మార్చింది ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మళ్లీ కెప్టెన్ ను చేసింది. దీంతో జడేజా కెప్టెన్ ముచ్చట 8 మ్యాచ్ లకే పరిమితమైంది. వాస్తవానికి లీగ్ ఆరంభం నుంచి చెన్నై కెప్టెన్ ధోనీనే. మధ్యలో సీఎస్కే పేరు పుణె సూపర్ జెయింట్స్ గా మారినా పగ్గాలు మాత్రం ధోనీ వద్దనే ఉన్నాయి. అయితే, అనూహ్యంగా ఈసారి లీగ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ కెప్టెన్సీ వదిలేశాడు. దీంతో జడేజాకు సారథ్యం దక్కింది. అయితే, చెన్నై ఈ సీజన్‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు నమోదుచేసింది.

ఆల్ రౌండర్ పై ప్రభావం
వాస్తవానికి ఈ సీజన్ కు ముందు జడేజా అద్భుత ఫామ్ లో ఉన్నాడు. అటు బంతితో, ఇటు బ్యాట్ తో రాణించాడు. శ్రీలంకతో సిరీస్ లో భారీగా పరుగులు చేశాడు. అదికూడా గాయం నుంచి కోలుకుని వచ్చి మరీ పరుగులు రాబట్టాడు. వికెట్లు తీశాడు. ఇదే ఊపులో సీఎస్కే కెప్టెన్సీ కూడా దక్కింది. రూ.16 కోట్లు పెట్టి సీఎస్కే అతడిని రిటైన్ చేసుకుంది. ఇది ధోనీ కంటే నాలుగు కోట్లు ఎక్కవు. కానీ.. మైదానంలో కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఆల్ రౌండర్ గా జడేజా రాణించలేకపోతున్నాడు. తన ప్రదర్శనపై నాయకత్వ భారం పడుతోందని జడ్డూ భావిస్తున్నాడు. గత కొన్ని సీజన్లుగా లోయరార్డర్ లో బ్యాటింగ్ కు దిగి చకచకా పరుగులు చేయడంతో పాటు ఛేజింగ్ ఫినిషర్ పాత్ర సైతం పోషించిన జడేజా ఇప్పుడు పూర్తిగా తేలిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో అతను 112 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

టీమిండియాకు కెప్టెన్ అవుతాడనుకుంటే..
వాస్తవానికి ఏ క్రీడాకారుడికీ కెరీర్ పూలపాన్పు కాదు. ఈ విషయం జడేజాకు బాగా తెలిసి ఉంటుంది. రెండుమూడుసార్లు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన అతడు తిరిగి రావడానికి చాలా శ్రమించాడు. వచ్చాక పాతుకుపోయాడు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా టీమిండియా ప్రధాన ఆల్ రౌండర్ గా సేవలందిస్తున్నాడు. జడేజా ఎంత రాటుదేలాడో.. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉదాహరణ. రోహిత్, రాహుల్, కోహ్లి సహా అందరూ విఫలమైన మ్యాచ్ లో జడేజా అద్భుత అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇక తర్వాత కథంతా మనం చూస్తున్నదే. విదేశీ పిచ్ లపై అశ్విన్ ను కాదని జడేజాను తీసుకుంటున్నారంటేనే అతడి ప్రదర్శన స్థాయి ఎలా ఉందో తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే కెప్టెన్సీ దక్కడం అతడి కెరీర్ కు మలుపుగా భావించారు. రంజీల్లోనూ ఏనాడు కెప్టెన్ గా వ్యవహరించని జడేజా కు ఇది టీమిండియా కెప్టెన్సీ దిశగా ఓ అడుగని భావించారు. కానీ, అతడు ఫ్రాంచైజీ కెప్టెన్సీనే సంభాళించలేకపోయాడు. ఒత్తిడి తట్టుకోలేక మధ్యలోనే వదిలేశాడు.

జట్టు కూర్పూ బాగోలేదు కదా..?
జడేజాకిది కెప్టెన్ గా తొలి సీజనే. ఈసారి టైటిల్ నెగ్గకున్నా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకు పోయేదేమీ లేదు. కానీ, జడేజా తొందరపడి సారథ్యం వదులుకున్నాడు. అయితే, ఇక్కడ అతడొక్కడి ఫామ్ మాత్రమే ఆందోళనకరంగా లేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి మిడిలార్డర్ వరకు ఎవరి ఫామ్ కూడా నిలకడగా లేదు. అందుకే జట్టు ఆరు ఓటములు ఎదుర్కొంది. ధోని ఒక మ్యాచ్ గెలిపించకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఇక బౌలింగ్ లో పేసర్ దీపక్ చాహర్ గాయం చెన్నైపై పెద్ద దెబ్బ వేసింది. స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ ఫామ్ లో లేడు. పేస్ ఆల్ రౌండర్ బ్రావో పనైపోయింది. ఇక నిలకడగా ఆడుతున్నది ఓపెనర్ ఊతప్ప, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అంబటి రాయుడు మాత్రమే.

ఆటపై ఏకాగ్రతకే..
''తన ఆటపై మరింత దృష్టి సారించడం కోసం జడేజా కెప్టెన్సీ వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. చెన్నైను మళ్లీ నడిపించాలని ధోనీని కోరాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతను అంగీకరించాడు. జడ్డూ తన ప్రదర్శనపై ధ్యాస పెట్టాలని ధోని కోరుకుంటున్నాడు'' అని చెన్నై శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.