Begin typing your search above and press return to search.

పాక్ పై ఒంటికాలితో ఆడ‌తా: ధోనీ

By:  Tupaki Desk   |   28 Aug 2017 4:55 PM GMT
పాక్ పై ఒంటికాలితో ఆడ‌తా: ధోనీ
X
టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ధోనీ మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో మ‌నంద‌రికీ తెలుసు. అమిత‌మైన అంకిత భావం గ‌ల భార‌త క్రికెట‌ర్ల‌లో ధోనీ ఒక‌డు. ఒంటి చేత్తో భార‌త్ కు అనేక విజ‌యాల‌ను అందించిన ఈ మాజీ కెప్టెన్ పై టీమిండియా చీఫ్ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ ప్ర‌శంస‌లు కురిపించారు. గ‌తంలో త‌న‌కు ఎమ్మెస్ కు మ‌ధ్య జ‌రిగిన ఓ సంద‌ర్భంగా గురించి మీడియాకు తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమం సంద‌ర్భంగా ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ ధోనీ అంకిత భావం గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. తాను ఎటువంటి ప‌రిస్థితుల‌లో ఉన్నా పాక్ తో మ్యాచ్ కు సిద్ధ‌మ‌ని ధోనీ త‌న‌తో అన్న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌సాద్ గుర్తు చేసుకున్నారు.

2016 ఆసియా కప్‌ సమయంలో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్ వ‌ద్ద‌ అసిస్టెంట్‌ గా ప్ర‌సాద్ ప‌నిచేస్తున్నార‌ట‌. దాయాది దేశం పాక్‌తో మ్యాచ్‌ కు 2రోజుల ముందు ధోనీ జిమ్‌ లో ప్రాక్టీస్ చేస్తూ వెయిట్స్‌ తో పాటు కిందపడ్డాడ‌ట‌. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న ధోనీని స్ట్రెచ‌ర్ పై తీసుకెళ్లి చికిత్స అందించార‌ట‌. ధోనీ ఫిట్‌ నెస్‌ పై అనుమానం ఉండ‌డంతో జట్టులోకి పార్దివ్‌ పటేల్‌ ని తీసుకురావాల్సిందిగా సందీప్‌ పాటిల్ కోరారట‌. మ్యాచ్‌కి ముందు రోజు ఉదయం మరోసారి ధోనీ వద్దకు వెళ్లిన‌పుడు మంచంపై నుంచి లేచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడ‌ని, అత‌డి ఆత్మ‌విశ్వాసం చూసి త‌న‌కు ముచ్చ‌టేసింద‌ని ప్ర‌సాద్ అన్నారు. అదే రోజు రాత్రి ధోనీ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడవడానికి ప్ర‌య‌త్నిస్తూ ఎలాగైనా కోలుకుని మ్యాచ్‌ ఆడాలన్నప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ని, ధోనీ పట్టుదల చూసి త‌న‌కు ఆశ్చర్యం వేసింద‌ని ప్ర‌సాద్ చెప్పారు.

ఆ త‌ర్వాతి రోజు ధోనీ మ్యాచ్ కు సిద్ధ‌మ‌య్యాడ‌ని, త‌న‌ గురించి ఎందుకు ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని తెలిపాడ‌ని ప్ర‌సాద్ అన్నారు. ‘నాకు ఒక కాలు లేకపోయినా నేను పాక్‌ తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉంటాను’ అని ధోనీ త‌న‌తో చెప్పాడ‌ని ప్ర‌సాద్ తెలిపారు. ధోనీ అంకిత భావం గురించి చెప్పడానికి ఈ ఒక్క సందర్భం సరిపోతుంద‌ని ప్రసాద్ అన్నారు. ధోనీ నాయకత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్‌లో పాక్‌పై విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు.అయితే, కొద్ది రోజుల క్రితం ధోనీ రిటైర్మెంట్ పై ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌సాద్ వ్యాఖ్య‌ల‌కు ధోనీ అభిమానుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వారిని శాంత‌ప‌రిచేందుకే ప్ర‌సాద్ ఈ అనుభ‌వాన్ని మీడియాతో పంచుకున్నాడ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.