Begin typing your search above and press return to search.

భార‌త్ బంద్ తో ధోనీకి సంబంధం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   12 Sep 2018 11:28 AM GMT
భార‌త్ బంద్ తో ధోనీకి సంబంధం లేద‌ట‌!
X
ప్ర‌స్తుతం `ఈ`-జ‌మానాలో సోష‌ల్ మీడియాను జ‌నం విచ్చ‌ల‌విడిగా వాడేస్తున్నారు. అయితే, రెండు వైపులా ప‌దునున్న క‌త్తి వంటి సోషల్ మీడియాను స‌రైనా మార్గంలో వినియోగించుకునేవారు కొంద‌రైతే....ఫేక్ న్యూస్ లు - వ‌దంతుల‌ను వ్యాపింప‌చేస్తూ...త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకునేవారు మ‌రి కొంద‌రు. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో బ్ర‌తికున్న సెల‌బ్రిటీల‌కు పాడె క‌ట్టిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇక పిల్ల‌ల కిడ్నాప్ ముఠాలు అంటూ మూక హ‌త్య‌లు జ‌ర‌గ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం....ఫేస్ బుక్ - వాట్సాప్ లకు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా జారీ చేసింది. అయిన‌ప్ప‌టికీ, ఫేక్ న్యూస్ వ్యాప్తి చెంద‌డం మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా - టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ..ఈ సారి నెటిజ‌న్ల ఫేక్ న్యూస్ కు బ‌ల‌య్యాడు. ఈ నెల 10న జ‌రిగిన భార‌త్ బంద్ కు ధోనీ మ‌ద్ద‌తు తెలిపాడంటూ ఓ పోస్ట్ వైర‌ల్ అయింది. పెట్రోల్ బంకు ద‌గ్గ‌ర ధోనీ కూర్చున్న ఫొటో ఒక‌టి స‌ర్క్యులేట్ అవుతోంది. అయితే, తాజాగా ఆ ఫొటో తీసిన వ్య‌క్తి అది గ‌తంలో ఓ యాడ్ కోసం దిగిన ఫొటో అని క్లారిటీ ఇవ్వ‌డంతో ఆ పుకార్ల‌కు తెర‌ప‌డింది.

తన సతీమణి సాక్షి సింగ్‌ - కొంతమంది సహచరులతో ధోనీ..ఓ పెట్రోల్‌ బంక్ లో కూర్చున్న ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ ఫొటోను చూసిన కాంగ్రెస్ నేత‌లు కొంత‌మంది ప‌ప్పులో కాలేశారు. ఆ ఫొటోను లైక్ చేస్తూ ట్వీట్స్ చేశారు. పెట్రోల్‌ ధరలను తాను భరించలేక ఇక‌పై హెలిక్యాప్టర్‌ షాట్స్‌ ఆడభోనని ధోని వ్యాఖ్యనించినట్లు పోస్ట్‌ లు కూడా నెటిజ‌న్లు సృష్టించారు. దీంతో, అస‌లు ఆ ఫొటో వెనుక ఉన్న స్టోరీని ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ సప్నా భవాని రివీల్ చేశారు. ఆ ఫొటో సెప్టెంబర్‌ 10న తీసింది కాదని...ఆగస్టు 29న సిమ్లాలో తీసింద‌ని చెప్పారు. ధోనీ, ఎలాంటి బంద్‌ లో పాల్గొనలేదని - ఓ యాడ్ కోసం సిమ్లా వెళ్లినప్పుడు హిందుస్తాన్‌ పెట్రోలియం వారు ఆ ఫొటో తీశార‌ని క్లారిటీ ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఖంగుతిన్నారు.