Begin typing your search above and press return to search.

2వేల ఆ కోడిపిల్లల కోసం ఆర్డర్ ఇచ్చిన ఎంఎస్ ధోని.. కారణమిదే?

By:  Tupaki Desk   |   25 April 2022 8:30 AM GMT
2వేల ఆ కోడిపిల్లల కోసం ఆర్డర్ ఇచ్చిన ఎంఎస్ ధోని.. కారణమిదే?
X
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ఏదీ చేసినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కెప్టెన్సీని వదులుకునే విషయమే కాదు..దేనిలో అయినా ఒక క్లారిటీతో ధోని ముందుకు వెళుతుంటాడు. అదే అతడిని అత్యుత్తమ ఆటగాడిగా.. కెప్టెన్ గా నిలిపింది. ఇప్పుడు క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని తన ఖాళీ టైంను వ్యవసాయానికి కేటాయిస్తున్నాడు. తన సొంతూరు జార్ఖండ్ లో కొన్ని ఎకరాల భూమి కొన్న ధోని అందులో ప్రకృతి సేద్యం చేస్తూ సేదతీరుతున్నాడు. వినూత్న పంటలు , పురుగుల మందు లేని పంటలను సాగుతు చేస్తున్నాడు.

తాజాగా ధోని మనసు ఆ కోడిపిల్లలపై పడింది. వాటిని పెంచడానికి రెడీ అయ్యాడు. ప్రోటీన్లు అత్యధికంగా ఉండే 'కడక్ నాథ్' కోడిపిల్లల కోసం తాజాగా ధోని అర్డర్ ఇచ్చాడు. రెండువేల కోడిపిల్లల కోసం మధ్యప్రదేశ్ లోని ఝాబువాలోని ఓ సహకార సమాఖ్యకు ధోని ఆర్డర్ చేసినట్లు స్థానిక కలెక్టర్ తెలిపారు. ఓ వాహనంలో రెండు వేల కోడిపిల్లలను రాంచీలోని ధోని ఫాంహౌస్ కు తరలించినట్లు తెలిపారు.

నిజానికి దోని తన ఫాంహౌస్ లో కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నాడు. ఎప్పుడో కరోనాకు ముందు వీటిని ఆర్డర్ చేశాడు. అయితే మహమ్మారి ప్రభావం ఉండటం.. అదే సమయంలో బర్డ్ ఫ్లూ సోకి అనేక కోళ్లు చనిపోవడం వల్ల వీటి డెలివరీ ఆలస్యమైంది.

ధోని లాంటి ప్రముఖ క్రికెటర్ కడక్ నాథ్ కోళ్లపై ఆసక్తి చూపడంతో ఇప్పుడు వాటి అమ్మకాలు జెట్ స్పీడులా దూసుకుపోతున్నాయి. అందరూ వాటి కోసం ఎగబడుతున్నారని వాటిని పెంచుతున్న వ్యాపారులు చెబుతున్నారు.ఎవరైనా ఆన్ లైన్ వేదికగా వీటిని ఆర్డర్ చేయవచ్చని ఝాబువా కలెక్టర్ తెలిపారు.

మధ్యప్రదేశ్ లోని ఝాబువా జిల్లాలో ఈ కడక్ నాథ్ కోళ్లను విరివిగా పెంచుతున్నారు. ఈ కోళ్ల పెంపకం ద్వారా ఈ జిల్లాకు బాగా పేరు వచ్చింది.2018లో జీఐ ట్యాగ్ కూడా లభించింది.

అత్యధిక పోషక విలువలు ఉంటే కడక్ నాథ్ కోళ్ల మాంసం, కోడిగుడ్ల రేటు అధికంగా ఉంటుంది. ఈ కోళ్లు తల నుంచి కాలి గోటి వరకూ కూడా మొత్తం నలుపురంగులో నిగనిగలాడుతుంటాయి.