Begin typing your search above and press return to search.

షాకింగ్: ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించారు

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:26 AM GMT
షాకింగ్: ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించారు
X
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోనీనే స్వయంగా తప్పుకున్నాడు కదా.. అతణ్ని తొలగించడమేంటి అనుకుంటున్నారా..? ఇక్కడ మాట్లాడుతోంది జాతీయ జట్టు కెప్టెన్సీ గురించి కాదులెండి. ఐపీఎల్ టీం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ నాయకత్వం గురించి. చెన్నై సూపర్ కింగ్స్ టీం రద్దయ్యాక గత ఏడాది దాని స్థానంలో పుణె సూపర్ జెయింట్స్ రావడం.. ధోనిని అదే జట్టుకు కెప్టెన్ గా ఎంచుకోవడం తెలిసిందే. ధోనితో పాటు మరికొంతమంది చెన్నై ఆటగాళ్లు ఈ జట్టులోనే చోటు సంపాదించారు. ధోనినే కెప్టెన్ గా ఎంపికయ్యాడు కూడా. కానీ ఈ జట్టు గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసింది. ఐదంటే ఐదే మ్యాచ్ లు గెలిచింది. ప్లేఆఫ్ కూడా చేరలేదు. ఐతే కొందరు కీలక ఆటగాళ్లు దూరమవడం కూడా ఆ జట్టు అలా ఆడటానికి ఒక కారణమే. ఏదేమైనా ఐపీఎల్లో మొదట్నుంచి చెన్నై జట్టు కెప్టెన్ గా ఉన్న ధోని.. ప్రతిసారీ ఆ జట్టును సెమీస్ చేర్చాడు. కానీ పుణె విషయంలో విఫలమయ్యాడు.

దీంతో ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించేసింది పుణె సూపర్ జెయింట్స్ యాజమాన్యం. అతడి స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కు పగ్గాలప్పగించింది. ఏప్రిల్లో మొదలయ్యే ఐపీఎల్ పదో సీజన్లో స్మిత్ నేతృత్వంలోనే పుణె జట్టు బరిలోకి దిగుతుంది. ధోని జస్ట్ ఆటగాడిగా మాత్రమే ఉంటాడు. ఇప్పటిదాకా పదేళ్ల కిందట ఇండియన్ టీం కెప్టెన్ అయిన ధోనిని.. ఇప్పటిదాకా ఎవరూ కెప్టెన్సీ నుంచి తొలగించాడు. టెస్టుల నుంచి తనంతట తానే తప్పుకున్నాడు. వన్డే.. టీ20ల విషయంలోనూ అలాగే జరిగింది. చెన్నై జట్టు కెప్టెన్ గా కూడా అతడికి తిరుగులేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ తొలిసారిగా ధోనిని ఇలా కెప్టెన్సీ నుంచి తొలగించడం అనూహ్యమైన విషయం. ఐతే పుణె జట్టు ప్రస్థానం ఈ ఏడాదే ముగిసిపోతుంది. వచ్చే ఏడాదికి మళ్లీ చెన్నై రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది. కాబట్టి ధోనిని మళ్లీ ఐపీఎల్లో సారథిగా చూడొచ్చు. కాకపోతే అతను ఇంకా ఎంత కాలం క్రికెట్లో కొనసాగుతాడన్నదే డౌటు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/