Begin typing your search above and press return to search.

గుజరాత్ ను వణికిస్తున్న కొత్త రోగం.. ఇప్పటికి 8 మంది మృతి

By:  Tupaki Desk   |   18 Dec 2020 11:08 AM GMT
గుజరాత్ ను వణికిస్తున్న కొత్త రోగం.. ఇప్పటికి 8 మంది మృతి
X
గుజరాత్ రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. కరోనా తాకిడికి ఇప్పటికిప్పుడు కోలుకుంటున్న వేళ.. ఆ రాష్ట్రాన్ని మరో ప్రాణాంతక వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మ్యూకోర్మైకోసిన్ అనే అరుదైన శిలీంద్ర వ్యాధి ఇప్పుడా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు అహ్మదాబాద్ లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ అరుదైన వ్యాధి కారణంగా గుజరాత్ తో పాటు ఢిల్లీ.. ముంబయిలోనూ కొత్త కేసులు బయటపడ్డాయి. అహ్మదాబాద్ లో ఇప్పటివరకు 44 మంది ఈ వ్యాధి బారినపడటం గమనార్హం. రెండురోజుల క్రితం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో పన్నెండు కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ వ్యాధికి గురైన వారంతా యాభై ఏళ్లకు పైబడిన వారు కావటమే గమనార్హం. ఆందోళన కలిగించే మరో అంశం ఏమంటే.. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించినట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ.. ఈ మ్యూకోర్మైకోసిస్ ఏమిటంటే.. ఈ వ్యాధిని గతంలో జైగోమైకోసిస్ అని వ్యవహరిస్తారు. అత్యంత అరుదైన ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది. శిలీంధ్రం కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. తొలుత ముక్కు నుంచి ప్రారంభమై.. కళ్లకు సోకుతుంది. వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే సరి. అదే జరిగితే ఫర్లేదు. కాదంటే.. ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

ఈ వ్యాధి బారిన పడిన తర్వాత కంటి చుట్టూ ఉండే కండరాలు పని చేయకుండా పోతాయి. దీని కారణంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. మెదడును చేరితే.. ఆ రోగి మెదడువాపు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెదడుతో పాటు.. ఇతర అవయువాలు కూడా పని చేయకుండా పోతాయి. ముంబయి.. అహ్మదాబాద్ నగరాల్లో ఇప్పటికే దీనిపై హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఈ వ్యాధి విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా హెచ్చరించారు.