Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ టీడీపీ వైపు.. నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   27 July 2022 6:29 AM GMT
ముద్ర‌గ‌డ టీడీపీ వైపు.. నిజ‌మేనా?
X
కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌స్తుతం గుంభ‌నంగా వ్య‌వ‌హరిస్తున్నారు. గతంలో వివిధ పార్టీల త‌ర‌ఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎంపీగా, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మంత్రిగానూ ముద్ర‌గ‌డ ప‌నిచేశారు. ఆ త‌ర్వాత కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఆయ‌న ద‌శాబ్దాలుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ తీవ్ర‌త‌ను పెంచారు.. ముద్రగ‌డ‌. ఈ నేప‌థ్యంలో తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. ఇది టీడీపీ, వైఎస్సార్సీపీల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

మ‌రోవైపు కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్యమాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అణ‌చివేసింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, ఆయ‌న స‌తీమ‌ణి, కుమారుడు, కోడ‌లును పోలీసుల‌తో అస‌భ్యంగా తిట్టించ‌డం, కొట్టించ‌డం చేశార‌ని స్వ‌యంగా ముద్ర‌గ‌డ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని తాను వ‌దిలివేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

కొంత‌మంది త‌న‌ను స్వ‌లాభం, స్వ‌ప్ర‌యోజ‌నాలు చూసుకునే వ్య‌క్తిగా త‌న‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని.. అందుకే ఆవేద‌న‌తో ఉద్య‌మాన్ని ఆపేస్తున్నాన‌ని ముద్ర‌గ‌డ ప్రక‌టించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును ఇబ్బందిపెట్ట‌డానికే ముద్ర‌గ‌డ రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని ఎత్తుకున్నార‌ని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే దాన్ని ప‌క్క‌న‌పెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై వ‌చ్చాయి.

గ‌త మూడేళ్లుగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పెద్ద‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. అడ‌ప‌ద‌డ‌పా సీఎంకు లేఖ‌లు రాయ‌డం త‌ప్ప‌. ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ టీడీపీలో చేర‌తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వైఎస్సార్సీపీలో కాపుల‌కు ఏ మేలు జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న భావ‌న‌గా ఉంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు కేంద్రం ఈబీసీల‌కు ప్ర‌క‌టించిన 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో ఐదు శాతం కాపుల‌కు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అలాగే విదేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌సించాల‌నుకునే కాపుల‌కు విదేశీ విద్యానిధి పేరుతో సాయం చేశార‌నే అభిప్రాయం ముద్ర‌గ‌డ‌లో ఉంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ అధికారంలోకి వచ్చాక చంద్ర‌బాబు కాపుల‌కు ఇచ్చిన ఐదు శాతం రిజ‌ర్వేష‌న్ ను ఎత్తేశార‌ని, అలాగే కాపుల రిజ‌ర్వేష‌న్ కూడా త‌న ప‌రిధి లేద‌ని తేల్చిచెప్పార‌ని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లో విద్య‌న‌భ్య‌సించడానికి కూడా కాపుల‌కు ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ముద్ర‌గ‌డ వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం కంటే టీడీపీ ప్ర‌భుత్వ‌మే మేల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

తాజాగా ముద్ర‌గ‌డ అనుచ‌రుడు.. ఏసుబాబు.. టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడును కూడా క‌లిసి .. ఆయ‌న‌తో చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే ఏసుబాబు.. టీడీపీలో చేరిక ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే..ఏసుబాబు ఏం చేసినా.. ముద్ర‌గ‌డ అనుమ‌తి తీసుకోకుండా..అడుగు కూడా వేయ‌ర‌ని అంటారు. ఈ నేప‌థ్యంలో ఏసుబాబును టీడీపీలోకి పంపించ‌డం ద్వారా.. ముద్ర‌గ‌డ టీడీపీకి అనుకూల‌మ‌నే సంకేతాలు పంపుతున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింద‌ని అంటున్నారు.