Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ లేటెస్ట్ స‌వాల్‌

By:  Tupaki Desk   |   4 Oct 2016 10:11 AM GMT
చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ లేటెస్ట్ స‌వాల్‌
X
కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి సీఎం చంద్ర‌బాబుపై భారీస్థాయిలో ఫైర‌య్యారు. చంద్ర‌బాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాపు ఉద్య‌మాన్ని అణిచేసేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ఎవ‌రూ భ‌య‌ప‌డేది లేద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జా ఉద్య‌మాల‌ను - ఆందోళ‌న‌ల‌ను అణిచేయాల‌ని చంద్ర‌బాబు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించార‌ని చెప్పిన ముద్ర‌గ‌డ నేత‌ల‌పై పీడీ యాక్టులు బ‌నాయించాల‌ని చెప్పార‌ని - దీనివ‌ల్ల ఆందోళ‌న కారులు - నేత‌లు భ‌య‌ప‌డి ఉద్య‌మాలకు దూరంగా ఉంటార‌ని బాబు క‌లలు కంటున్నార‌ని ముద్ర‌గ‌డ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ వ‌చ్చిన ముద్ర‌గ‌డ మీడియాతో మాట్లాడారు.

రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని తేల్చి చెప్పారు. జైళ్లకు - బెయిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమకారులు - ఆందోళనకారులపై పీడీయాక్ట్ బనాయించి అణచివేయాలని సీఎం చంద్రబాబు.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వ‌డం ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తేనా? అని ప్ర‌శ్నించారు. విప‌క్షంలో ఉన్న సమ‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వాల‌పై అనేక ఉద్య‌మాలు చేశార‌ని, అవి గుర్తు లేవా? అని ముద్ర‌గ‌డ ప్ర‌శ్నించారు. కాపుల‌కు ఎన్నిక‌లముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీ మేర‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి తీరాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ విష‌యంలో బీసీ సోద‌రుల‌ను తాము ఎక్క‌డా త‌క్కువ చేయ‌డం లేద‌న్న ముద్ర‌గ‌డ‌ - వారి రిజ‌ర్వేష‌న్ల‌కు తాము అడ్డు కాబోమ‌ని - కాపు జాతికి రావాల్సిన రిజ‌ర్వేష‌న్ల‌నే అడుగుతున్నామ‌ని అన్నారు. పీడీ చ‌ట్టంతో ఉద్య‌మం ఆగిపోతుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటే వ‌ట్టి భ్ర‌మేన‌న్నారు. కాపు రిజర్వేషన్ల పోరాట భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన ముద్రగడ పద్మనాభం వివిధ వర్గాల మేధావులను - బీసీ సంఘాల నేతలను కలిశారు. భ‌విష్య‌త్తులో చేప‌ట్టే ఉద్య‌మాల‌కు మద్ద‌తివ్వాల‌ని కోరారు. కాగా, చంద్ర‌బాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు ముద్ర‌గ‌డ సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/