Begin typing your search above and press return to search.

అంత మొండితనం అవసరమా ముద్రగడ

By:  Tupaki Desk   |   18 Jun 2016 4:36 AM GMT
అంత మొండితనం అవసరమా ముద్రగడ
X
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తాను అనుకున్నది దాదాపుగా సాధించినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తుని విధ్వంసకాండలో సంబంధం ఉందన్న ఆరోపణల మీద పోలసులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. గదిచిన పది రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ.. తాజాగా దీక్ష కొనసాగించటంపై భిన్నాభిన్నాయాలు వ్యక్తమవుతున్నాయి. తుని ఘటన డిమాండ్ తో నిరసన చేయటంపై ఇప్పటికే కొంత వ్యతిరేకత మూట కట్టుకున్న ముద్రగడ.. తాజాగా మొండితనంతో దీక్షను కంటిన్యూ చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఎందుకిలా అంటే.. ముద్రగడ కోరినట్లే తుని కేసులో సంబంధం ఉందంటూ అరెస్ట్ చేసిన 13 మందిలో పది మందికి ఇప్పటికే బెయిల్ వచ్చేసింది. మిగిలిన ముగ్గురు విషయంలోనూ సాంకేతిక కారణాల వల్ల బెయిల్ పిటీషన్ డిస్మిస్ అయ్యాయి. ఆ మూడు బెయిల్ పిటీషన్లు కూడా శనివారానికి ఓకే అయ్యే పరిస్థితి. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ.. కలెక్టర్లు ముద్రగడకు వివరించినా.. ఆయన మాత్రం దీక్షను విరమించేందుకు ససేమిరా అనటం గమనార్హం.

తాను కోరినట్లుగా13 మందికి బెయిల్ వచ్చే వరకూ తాను వెనక్కి తగ్గనంటూ మొండికేయటంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వారంత టెన్షన్ పడటానికి కారణం లేకపోలేదు. దీక్ష మొదలెట్టి పది రోజులు కావటం.. మధ్యలో నాలుగైదు సెలైన్లు మినహా ఆయన ఎలాంటి వైద్యాన్ని ఒప్పుకోని నేపథ్యంలో.. ఆయన యూరిన్ లో కీటోను బాడీస్ పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సెలైన్ ఎక్కించుకోవటానికి ముద్రగడ ఓకే చెప్పినా.. పూర్తిస్థాయివైద్యానికి మాత్రం ఆయన నో చెబుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఒక విధ్వంసంలో చట్టప్రకారం అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలంటూ దీక్ష చేయటంపైనే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన డిమాండ్ కు తగ్గట్లే పది మందికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ముద్రగడదీక్షను విరమించకపోటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ముద్రగడ ఆరోగ్యంతో ఏపీ రాష్ట్ర భావోద్వేగాలపై ప్రభావం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ముద్రగడకు అనుకోనిది ఏం జరిగినా.. దాని ప్రభావం ఏపీ మీద చాలానే ఉంటుంది. ప్రభుత్వం తన డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నా.. మొండికేసిన తీరులో తాను చెప్పినవన్నీ జరిగి తీరాలన్నట్లుగా వ్యవహరించటం సరైన విధానం కాదన్నమాట వినిపిస్తోంది.

ఈ వాదనకు కౌంటర్ గా.. ప్రభుత్వ వైఖరిని నమ్మాల్సిన అవసరం లేదన్న మాటను ముద్రగడ వర్గీయులు వాదిస్తున్నారు. అరస్ట్ చేసిన వారిని విడుదల చేయటమే లక్ష్యంగా దీక్ష మొదలెట్టిన తర్వాత కూడా.. పలువురిని పోలీసులు అరెస్ట్ చయటం ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ వ్యవహారం వివాదంగా మారినప్పుడు.. సంయమనంతో వ్యవహరించాల్సిన పోలీసులు.. రెచ్చగొట్టేలా మరికొందరిని ఎందుకు అరెస్ట్ చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా.. మొత్తం 13 మందిలో పది మందికి బెయిల్ వచ్చేసి.. మిగిలిన వారికి బెయిల్ రానున్న నేపథ్యంలో ముద్రగడ తన మొండితనాన్ని పక్కన పెట్టేసి.. దీక్ష విరమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరి.. ముద్రగడ ఏం చేస్తారో..?