Begin typing your search above and press return to search.

పోలీసులు..డాక్టర్లు ముద్రగడ అంటే బెదిరిపోతున్నారట

By:  Tupaki Desk   |   11 Jun 2016 4:23 AM GMT
పోలీసులు..డాక్టర్లు ముద్రగడ అంటే బెదిరిపోతున్నారట
X
కాపు ఉద్యమనేత ముద్రగడ అంటే చాలు.. అటు పోలీసులు.. ఇటు డాక్టర్లు వణికిపోతున్నారు. ఆయనకు సంబంధించిన డ్యూటీ వేస్తే చాలు.. భయపడిపోతున్నారు. ఆయన బాధ్యత తీసుకోవటానికి జంకుతున్నారు. ఆయన బాధ్యత తీసుకుంటే ఎప్పుడు ఏమవుతుందో తెలీక వణికిపోయే పరిస్థితి. తన వైఖరితో షాకుల మీద షాకులిస్తున్న ముద్రగడ దెబ్బకు పోలీసు వర్గాలు హడలిపోతున్నాయి.

విషయం సెన్సిటివ్ కావటం.. ఏం జరిగినా దాని పరిణామాలు తీవ్రంగా ఉండటంతో.. ముద్రగడ వ్యవహారాన్ని చూడమంటే చాలు.. పెద్ద శిక్ష వేసినట్లుగా ఫీలయ్యే పరిస్థితి. తుని ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసుల వైఖరిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్లో హడావుడి చేయటం దగ్గర నుంచి తాజాగా ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నంత వరకూ ముద్రగడ తీరు పోలీసులకు షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి.

తనను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయగా.. రాజమహేంద్రవరంలోని సీఐడీ ఆఫీసుకు తీసుకెళుతున్నట్లుగా చెప్పిన పోలీసులు.. తిన్నగా ఆయన ఇంటికి తీసుకొస్తే.. పోలీసు వాహనం దిగనంటూ మొండికేసి పోలీసులకు చెమటలు పట్టించారు. గంటల పాటు సాగిన ఈ డ్రామాను ఏదోలా ఒక కొలిక్కి తెచ్చిన పోలీసులకు.. ఆమరణ దీక్ష అంటూ ఇంటి తలుపులు వేసుకొని దీక్ష చేయటం.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తే.. పురుగుల మందు డబ్బాను పట్టుకొని బెదిరించటంతో పోలీసులు వణికిపోయారు.

తీవ్ర ఒత్తిడికి గురైన పోలీసులు.. ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించిన ముద్రగడను నిలువరించేసరికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. ఆయన ఇంటి నుంచి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రిలో తనదైన శైలిలో డాక్టర్లకు సినిమా చూపిస్తున్నారు.

తాను చేస్తున్న దీక్షను భగ్నం చేసేలా వైద్యులు వ్యవహరిస్తే బాగుండదని చెబుతూ.. చికిత్స చేసేందుకు వైద్యుల్ని ఆయన అనుమతించటం లేదు. వైద్యం చేయటానికి వస్తున్న వైద్యులను హెచ్చరిస్తూ.. తన తలను గోడకేసి కొట్టుకుంటున్నానని చెబుతున్నారు. దీంతో.. ఆయనకేమైనా జరిగితే ఇంకేమైనా ఉందా? అంటూ హడలిపోతున్న వారు.. ఓపక్క ఆయనకు వైద్యం చేయలేక.. మరోవైపు ఆయన్ను కన్వీన్స్ చేయలేక కిందామీదా పడుతున్నారు. ప్రభుత్వాన్నే కాదు.. పోలీసులు.. వైద్యుల్ని ముద్రగడ తనదైన శైలితో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని చెప్పాలి.