Begin typing your search above and press return to search.

తన తీరుతో బాబుకు మరో షాకిచ్చిన ముద్రగడ

By:  Tupaki Desk   |   22 Jun 2016 11:30 AM GMT
తన తీరుతో బాబుకు మరో షాకిచ్చిన ముద్రగడ
X
వయసు పెరుగుతున్న కొద్దీ.. కొందరిలో దూకుడు తగ్గుతుంది. కానీ.. కాపు నేత ముద్రగడ తీరు అందుకు భిన్నం. పద్నాలుగు రోజులకు పైనే దీక్ష చేసి.. తన డిమాండ్లను సాధించుకున్నాక దీక్ష విరమించిన ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనలోని ఆవేశాన్ని చూసి ఆశ్చర్యపోయినోళ్లే ఎక్కువ. నిజానికి ఆయన దీక్ష విరమణ వ్యవహారంలో పెద్ద హైడ్రామానే చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న ఆయన.. అక్కడ నుంచి కిర్లంపూడిలోని తన ఇంటికి వచ్చి.. తన మద్దతుదారుల మధ్యన దీక్షను విరమించారు.

సుమారు 65 ఏళ్లకు పైనే వయసున్న ఒక వ్యక్తి (ముద్రగడ బర్త్ ఇయర్ 1952) పద్నాలు రోజులు దీక్ష చేసిన తర్వాత.. ఆయన కదిలే పరిస్థితుల్లో ఉంటారా? అన్నది ఒక ప్రశ్న. ఇక.. ముద్రగడ విషయానికి వస్తే ఆయనకు సుగర్.. బీపీ.. లాంటి ఆరోగ్య సమస్యలున్న విషయాన్ని మర్చిపోకూడదు. దీక్ష నేపథ్యంలో దాదాపు ఏడెనిమిది రోజులు అయితే పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదన్నది మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక.. వైద్యుల బులిటెన్లను ప్రాతిపదికగా తీసుకుంటే ముద్రగడ తన దీక్షా కాలంలో మొత్తంగా 10 సెలైన్ బాటిల్స్ కు మించి పెట్టుకున్నట్లగా కనిపించదు. మరి.. ఇంత పెద్ద మయసులో.. ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి పద్నాలుగు రోజులు దీక్ష చేశాక.. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి వరకూ ప్రయాణించే పరిస్థితి ఉంటుందా?

తన ఇంటికి చేరుకున్న తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ అమ్మ బూతులు తిట్టే ఓపిక ఉంటుందా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలే వీలుంది. అందుకే కాబోలు అలాంటి సందేహాలు ఏమీ ఉండకూదన్నభావనో.. మరింకేమో కానీ.. గడ్డం నెరిసి.. కాస్త నలిగినట్లుగా ముద్రగడ కనిపించారు. అయితే.. ఆయన మాటలో మాత్రం ఎలాంటి బడలిక కనిపించలేదు. దీక్ష చేసిన తాలూకు నీరసం.. ఆయన తిట్ల వర్షంలో కొట్టుకు పోయాయి. మొదటినుంచి ముద్రగడ వ్యూహ చతురత ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉండటం.. నోట మాట రానివ్వకుండా చేయటం.. ఆత్మరక్షణలో పడిపోయేలా మారటం లాంటివి కనిపిస్తాయి

ప్రత్యర్థిపై తనది పైచేయిగా ఉండటాన్ని అర్థం చేసుకున్న ముద్రగడ.. మరో అవకాశం ఇవ్వకుండా.. మీడియాతో మాట్లాడేందుకు తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లగా కనిపిస్తుంది. తనను గౌరవంగా చూసుకున్నట్లే చెప్పిన ఆయన.. తన భార్యను.. కోడలి పట్ల దారుణంగా మాట్లాడారంటూ భావోద్వేగాన్ని తట్టి లేపేలా మాట్లాడటం గమనార్హం. ఈ సందర్భంగా ఆవేశంతో బండ బూతులు తిట్టిన ముద్రగడ కంటతడి పెట్టటం గమనార్హం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. ముద్రగడను మర్యాదగా చూసినప్పుడు.. ఆయన కుటుంబ సభ్యుల విషయంలో దూకుడు ప్రదర్శించే సాహసం పోలీసులు చేసే అవకాశం ఉందా?అని.

దీక్ష మొదలు పెట్టిన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత కానీ తలుపుబద్ధలు కొట్టాలే కానీ.. మొదటి రోజే కొట్టేసి తనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటాన్ని ముద్రగడ తప్పు పట్టారు. ఓ చేతిలో పురుగుల మందు బాటిల్ పట్టుకొని.. ఏ నిమిషాన ఏం చేస్తారో తెలీక గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే.. పోలీసులు మాత్రం ఏం చేయగలరు? భావోద్వేగంతో పొరపాటున పురుగుల మందు తాగితే పరిణామాలు ఎలా ఉంటాయోముద్రగడకు తెలీనవా? అలాంటి పరిస్థితుల్లో పోలీసులు మూడు..నాలుగు రోజులు వెయిట్ చేస్తే జరిగే నష్టం ఎంతన్నది రాజకీయం గురించి అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కానీ.. అలాంటి లాజిక్కులు బయటకు రాకుండా ఉండటంతో పాటు.. తన డిమాండ్లకు ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించి.. తుని విధ్వంస నిందితుల్ని విడిచి పెట్టిన దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేకుండా.. భారీ తిట్ల దండకం అందుకున్నట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తరచి చూస్తే.. ఈ వాదనలో కొంత లాజిక్ ఉందన్న భావన కలగటం ఖాయం.