Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ ప్లాన్ మొత్తం మార్చేశార‌ట‌

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:21 AM GMT
ముద్ర‌గ‌డ ప్లాన్ మొత్తం మార్చేశార‌ట‌
X
కాపు ఉద్య‌మ‌నేత‌ ముద్రగడ పద్మనాభం త‌న పోరాట వ్యూహాన్ని మార్చుకున్న‌ట్లు చెప్తున్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్ హోదా కోసం ఇప్పటివరకూ కేవలం సొంత సామాజికవర్గాల మద్దతుకే పరిమితమైన ఇక‌పై ఇత‌ర కుల‌స్థుల అండ‌తోనూ ముందుకు సాగాల‌ని భావిస్తున్నారు. కేవలం తన సామాజికవర్గం దన్నుతోనే పోరాడుతుండ‌టంతో సర్కారు తమపై ఇతర సామాజికవర్గాలను ఉసిగొల్పుతోందని గ్రహించిన ముద్రగడ ఇకపై కాపేతరులను కూడా తమ ఉద్యమానికి మద్దతుగా కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా అధికారపార్టీ సామాజికవర్గానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఆ వర్గాల మద్దతు కూడగట్టే వ్యూహానికి తెరలేపారు. అందులో భాగంగానే గత కొద్దిరోజుల నుంచి ముద్రగడ సమావేశాలకు ఇతర కులాలను కూడా ఆహ్వానిస్తుండటం కనిపిస్తోందని అంటున్నారు.

విజయనగరం - గోదావరి జిల్లాల్లో కూడా కాపేతరులను తమ సమావేశాలకు ఆహ్వానించి, కాపు రిజర్వేషన్ పోరాటానికి మద్దతు ఇవ్వాల‌ని, మీ సమస్యల పరిష్కారానికి చేసే ఉద్యమాలకు కాపులు కూడా దన్నుగా నిలుస్తారని, ఆ ప్రకారంగా అన్ని సామాజికవర్గాలు కలసి హక్కుల సాధన కోసం సర్కారుపై పోరాడదామని ముద్ర‌గ‌డ‌ పిలుపునిస్తున్నారు. దీనివెనుక భారీ వ్యూహమే ఉందని కాపు వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు - కృష్ణా జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గంపై మిగిలిన సామాజికవర్గాలు ఆగ్రహంతో ఉన్న వైనాన్ని గ్రహించిన ముద్రగడ, అక్కడ ఇతర కులాలను కమ్మ వర్గానికి దూరం చేస్తే సర్కారు చిక్కుల్లో పడుతుందన్న వ్యూహంతో, కాపులు మిగిలిన కులాలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపించే వ్యూహానికి తెరలేపినట్లు స‌మాచారం. ‘గత రెండేళ్ల నుంచి ఆ వర్గం వాళ్లే అన్ని రకాలుగా లబ్ధిపొందుతున్నారు. నియామకాలు - బదిలీలు - అన్నింటిలో వాళ్లకే న్యాయం జరుగుతోంది. మిగిలిన కులాలను పట్టించుకోవడం లేదు. ఆ వర్గం దూకుడుకు కొన్ని ప్రాంతాల్లో రెడ్లు - మరికొన్ని ప్రాంతాల్లో కాపులు - బీసీలు నష్టపోతున్నారు. వారిని సమన్వయం చేసుకుని, కమ్మ వర్గం మాదిరిగా కాకుండా కాపులు అన్ని కులాలను సమన్వయం చేసుకుంటారన్న సంకేతాలు పంపించడమే మా ధ్యేయం. ఇటీవల సోషల్ మీడియాలో కమ్మ వర్గ హవాను చూసి చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. ఈ సామాజిక సమీకరణను మేం సద్వినియోగం చేసుకోవాలి కదా? పైగా మాకు కూడా ఇతర కులాల మద్దతు అవసరం’అని కాపు జేఏసీ నేత‌లు అంటున్నారు. ఈ వ్యూహం ఫలించినట్లు కనిపిస్తోందని కాపునాడు నేతలు చెబుతున్నారు. ముద్రగడ సమావేశాలకు మిగిలిన కులాల వారు హాజరుకావడం కాపునేతలను సంతోషపరుస్తోంది.

ఇదిలాఉండగా, కాపు-బలిజల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో ముద్రగడ తన వైఖరి కూడా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ముద్రగడ కేవలం వైసీపీ అజెండా ప్రకారమే వెళుతున్నారని, అందరినీ సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి వద్దకు ఇంతవరకూ ఎందుకు వెళ్లలేదని, ఇటీవలి కాలంలో బలిజ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఓ.వి.రమణ లేవనెత్తుతున్న ప్రశ్నలతో ఆత్మరక్షణలో పడిన ముద్రగడ.. ఆ విషయంలో తొలిసారి తన వైఖరి మార్చుకోవలసి వచ్చింది. సరైన పిలుపు, మర్యాదపూర్వకమైన ఆహ్వానం వస్తే చర్చలకు సిద్ధమేనని ప్రకటించాల్సి వచ్చింది. ఇది ఒకరకంగా బలిజ నేతలు సాధించిన విజయమే అయినప్పటికీ, ముద్రగడ ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వస్తుందన్న సంకేతాలు, ఆయనను వ్యతిరేకించే వర్గాలకు వెళ్లేందుకు దోహదపడుతుందని కాపు జెఎసి నేతలు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/