Begin typing your search above and press return to search.

తాను ఆగిపోయేది లేదంటున్న ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   3 Feb 2017 8:57 AM GMT
తాను ఆగిపోయేది లేదంటున్న ముద్ర‌గ‌డ‌
X
కాపు సామాజికవ‌ర్గం మనుగడ కోసం చేస్తున్న ఉద్యమాన్ని తాము ఆపేది లేదని కాపు ఉద్యమ నేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేసులతో భయపెట్టి ఉద్యమాన్ని ఆపాల‌ని చూస్తోంద‌ని కానీ ఇది సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని ముద్ర‌గ‌డ తేల్చిచెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం - మందస - సోంపేట మండలాల్లో పలు సామాజిక వ‌ర్గాల నాయకులను కలిసిన ముద్ర‌గ‌డ‌ ఉద్యమానికి వారి మద్దతు కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల విషయాన్ని మర్చిపోతున్న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు త‌న రాజ‌కీయాల కోసం త‌ట్టి లేపార‌ని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన పాదయాత్ర సందర్భంగా గుర్తు చేసి మరీ కాపుల‌కు బీసీ హోదాపై హామీలు గుప్పించారని పేర్కొన్నారు. కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మర్చిపోయారని విమర్శించారు. ఇపుడు రిజ‌ర్వేష‌న్లు అడిగితే కాపుల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు ప్ర‌య‌త్నం సాగిస్తున్నార‌ని ముద్ర‌గ‌డ ఆరోపించారు. విభజించు, పాలించు విధానాన్ని అవలంభిస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కాపుల‌ను బీసీల్లో చేర్చే వరకూ ఉద్యమం ఆగదని అన్నారు.

టీడీపీ అధ్య‌క్షుడిగా త‌మ‌కు ఇచ్చిన హామీని సీఎంగా నెర‌వేర్చాల‌ని కోరుతూ హోదాకోసం తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను రెండుసార్లు అడ్డుకున్నారని ముద‌గ్ర‌డ మండిప‌డ్డారు. గాంధేయమార్గంలో ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత పోలీసుల సహకారంతో ఉక్కుపాదంతో తమపై అణచివేశార‌ని మండిప‌డ్డారు. కొంద‌రు పోలీస్ అధికారులు సైతం త‌మ విధి నిర్వ‌హ‌ణ‌ను ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబుకు జై కొట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఆక్షేపించారు. ఇచ్చిన మాట త‌ప్పిన చంద్ర‌బాబు తీరును వివ‌రించేందుకు జిల్లాల వారీగా ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్న‌ట్లు వివ‌రించారు. దీంతో పాటుగా ఐక్యంగా ఉద్య‌మించి రిజ‌ర్వేష‌న్ సాధించుకోవాల‌ని కాపు - బలిజ - తెలగ - ఒంటరి కులస్తుల‌కు ముద్ర‌గ‌డ సూచించారు. త‌మ పోరాటంలో ఇత‌ర సామాజిక వ‌ర్గాల వారిని భాగ‌స్వామ్యం చేసుకునేందుకు శ్రీ‌కాకుళం వ‌చ్చిన‌ట్లు ముద్ర‌గడ వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/