Begin typing your search above and press return to search.

చంద్రబాబుకైతే అనుమతులు అవసరం లేదా?

By:  Tupaki Desk   |   22 Nov 2016 10:17 AM GMT
చంద్రబాబుకైతే అనుమతులు అవసరం లేదా?
X
కాపుల సమస్యలు - రిజర్వేషన్ల కోసం నిత్యం చంద్రబాబుకు ఉత్తరాలు రాసే ముద్రగడ పద్మనాభం ఈసారి ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. వారం రోజులుగా తనను గృహ నిర్బంధంలో ఉంచడం... ఉభయ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ - 30 పోలీస్ యాక్ట్ ను ఎత్తివేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. అంతేకాదు... తన సత్యాగ్రహ యాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ఆయన డిమాండు చేశారు.

ముద్రగడ రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర చేయడానికి ఈ నెల 16న సిద్ధమయ్యారు. కానీ, పోలీసులు ఆయన్ను ముద్రగడను ముందుగానే గృహ నిర్బంధం చేశారు. దాంతో ముద్రగడ యాత్ర భగ్నమైంది. నిజానికి సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు.

దీంతో ముద్రగడ ఈ రోజు డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. గతంలో చంద్రబాబు గానీ, పలువురి నేతలు గానీ.. యాత్రలకు అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లేని అనుమతి తమకు ఎందుకని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు - ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30 - 144 అమలు చేస్తున్నారని.. సెక్షన్ 30 తన జీవితాంతం అమల్లో ఉంటుందా.. లేదా 2019 లో జరిగే ఎన్నికల వరకు అమలు చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/