Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ రూటు మార్చేశారు

By:  Tupaki Desk   |   18 Jun 2017 7:25 AM GMT
ముద్ర‌గ‌డ రూటు మార్చేశారు
X
కాపుల‌కు బీసీ రిజర్వేష‌న్ కోసం గ‌ళం విప్పుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం త‌న రూట్ మార్చారు. త‌న కుల‌స్తుల కోసం ఆందోళ‌న చేసిన ముద్ర‌గ‌డ తాజాగా అన్న‌దాత‌ల కోసం గొంతువిప్పారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. కాపుల ఉద్య‌మాన్ని ఒక ప‌క్క కొన‌సాగిస్తూనే అన్న‌దాత‌ల ఆందోళ‌న‌ల‌ను అందులోనూ వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర ప్రాంతంలోని అన్న‌దాత‌ల‌ అంశాన్ని ముద్ర‌గ‌డ ఎత్తుకున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని త‌న నివాసంలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ సీఎంకు తాను రాసిన లేఖ ప్రతులను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విడుదల చేశారు. రైతులను నష్టపెడితే పతనమైపోతారని, అటువంటి ఆలోచనల నుండి బయటపడాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలో కస్ట‌మ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్టుమెంట్‌ కు భూమి ఎకరాకు రూ.2.5 కోట్ల ధరతో ఒకటిన్నర ఎకరాలను కేటాయించినట్లుగా పత్రికలలో చూశానని, ఈ మేరకు రెవెన్యూ శాఖ నుండి జిఒ కూడా విడుదలైందని పేర్కొన్నారు. రైతుల నుండి బలవంతంగా సేకరించే భూములకు కూడా ఇదే ధర చెల్లిస్తారా అని ముద్రగడ ఆ లేఖలో ప్రశ్నించారు.

రైతుల నుంచి సేకరించిన భూములు విదేశీయులకు ధారాదత్తం చేసే భూములకు, ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే భూములకు పెద్దపాడు గ్రామంలో భూమి అమ్మిన రేటు ప్రకారం ఈ వర్గాలకు అదే ధర చెల్లించి అమలు చేయడానికి అభ్యంతరం ఉండకూడదని సీఎం చంద్రబాబును ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. రైతుకు, ప్రభుత్వానికి ధర చెల్లింపులో వ్యత్యాసం ఎందుకని, ఒకే విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదో తెలుసుకోవచ్చునా అని ఆ లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ప్రభుత్వానికే భూములు ఇచ్చే విధానంలో పక్షపాతం లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదని, ప్రత్యేక హోదాకు కేంద్రం మమ అన్నందుకు మంచి గుణపాఠం చెప్పారన్నారు. ఈ విషయంలో చంద్రబాబును అభినందించి తీరాల్సిందేనని ముద్ర‌గ‌డ ఎద్దేవా చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎస్‌ ఇజడ్‌ కు భూములు తీసుకునే విధానం ముఖ్యమంత్రికి తెలుసునని ముద్ర‌గ‌డ గుర్తుచేశారు. 2012, ఏప్రిల్ 20వ తేదీన పుట్టిన రోజు వేడుకలను పక్కనబెట్టి జిల్లా ఎస్‌ ఇజడ్ ప్రాంతంలో పర్యటించి రైతుకు రూ.3లక్షలు ఇచ్చి, ఎకరా కోటి రూపాయలకు జగన్ అమ్ముకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారని, ఆ మాటలు ఆచరణకు నోచుకోవా అని ఆయన చంద్ర‌బాబును ముద్ర‌గ‌డ సూటిగా ప్ర‌శ్నించారు. తమరు అధికారంలోకి రాగానే గతంలో చెప్పిన మాటలే మర్చిపోయారా అని లేఖలో ముద్రగడ ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/