Begin typing your search above and press return to search.

తెర‌పైకి కొత్త ఫార్ములా..బాబుకు చుక్క‌లేనా?

By:  Tupaki Desk   |   1 Jun 2018 7:28 AM GMT
తెర‌పైకి కొత్త ఫార్ములా..బాబుకు చుక్క‌లేనా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇర‌కాటంలో ప‌డే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇప్ప‌టికే ఓ వైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షనేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌తో ప్ర‌జాక్షేత్రంలో పాద‌యాత్ర చేస్తూ స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతుండంటం - మ‌రోవైపు కొద్దికాలం కింద‌టివ‌ర‌కు త‌న‌తో క‌లిసి న‌డిచిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవినీతిపై దుమ్మెత్తిపోస్తుండ‌టం ఇంకోవైపు మాజీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కేంద్ర సాయంపై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తున్న తీరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌రో షాకింగ్ ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం చేయ‌డ‌మే కాకుండా సీఎం చంద్ర‌బాబు తీరుపై విరుచుకుప‌డుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ నుంచి బ‌హిష్కృతుడైన సీనియ‌ర్ నేత మోతుకుపల్లి నర్సింహులును ఆయన నివాసంలో కలిశారు.

మోత్కుప‌ల్లి స‌స్పెన్ష‌న్‌ - తాజా పరిణామాలపై మోత్కుపల్లితో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మంతనాలు జ‌రిపారు. 35 ఏళ్లు పార్టీకి సేవ చేసిన మోత్కుపల్లి పట్ల టీడీపీ తీరును ముద్రగడ తప్పుప‌ట్టారు. అవసరానికి వాడుకొని వదిలేయటం చంద్రబాబు నైజం అంటూ ముద్రగడ మండిప‌డ్డారు. మోత్కుపల్లి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ముద్రగడ తెలిపారు. ఏపీలో కాపు ఉద్యమం - చంద్రబాబు దుర్మార్గపు పాలనపై తమ పోరాటానికి మోతుకుపల్లి మద్దతును ముద్రగడ కోరారు. ఏపీలో ప‌ర్య‌టించాల‌ని - యాత్ర చేప‌ట్టాల‌ని ముద్ర‌గ‌డ కోరారు. అందుకు త‌మ పూర్తి స‌హాయం అందిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. దీనికి మోత్కుప‌ల్లి సానుకూలంగా స్పందించార‌ని స‌మాచారం. ఏపీలో ప్రభుత్వంపై ముద్రగడతో పాటు ఇత‌రులు చేస్తున్న‌ పోరాటాలకు తన మద్దతు ఉంటుందని మోత్కుప‌ల్లి హామీ ఇచ్చారు.

కాగా, ఏపీలో మూడు ప్ర‌ధాన అగ్ర‌వ‌ర్ణ సామాజిక‌వ‌ర్గాల్లో ఒక‌టైన కాపులకు ప్ర‌తినిధిగా ఉన్న ముద్ర‌గ‌డ మోత్కుప‌ల్లితో భేటీ అవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు ఇది వేదిక అని ప‌లువురు అంటున్నారు. ద‌ళితుల్లో కీల‌క‌మైన వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత‌గా పేరున్న మోత్కుప‌ల్లిని ఏపీలో ప‌ర్య‌టింప‌చేయ‌డం ద్వారా చంద్ర‌బాబును మ‌రింత ఇర‌కాటంలో పెట్టేందుకు, ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ద‌ళిత వ్య‌తిరేక కార్యక్ర‌మాల‌ను చాటిచెప్పేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. కాగా ఇటు ద‌ళితులు, అటు కీల‌క‌మైన కాపు సామాజిక‌వ‌ర్గం ఏక‌మై త‌మ పార్టీపై చేయ‌బోయే ఎదురుదాడి క‌చ్చితంగా టీడీపీకి ఇబ్బందిని క‌లిగించేదేన‌ని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.