Begin typing your search above and press return to search.

ఏపీలో మరో కొత్త పార్టీ వస్తుందా?

By:  Tupaki Desk   |   22 May 2016 7:43 AM GMT
ఏపీలో మరో కొత్త పార్టీ వస్తుందా?
X
రాజకీయంగా ఏదో చేయాలని తెగ తపించిపోతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మారో కొత్త కాంబినేషన్ ట్రై చేయడానికి రెడీ అవుతున్నారు. కాపులను రెచ్చగొట్టి రచ్చరచ్చ చేసినా వ్యక్తిగతంగా అది తనకు డామేజే తప్ప ఇమేజి తేకపోవడంతో ముద్రగడ మరో అటెంప్టు చేస్తున్నారు. ఏపీలో కాపులు - దళితులు కలిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఆయన బుర్రలో మదిలో మెదిలిన ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ను ఆయన ఈరోజు కలిశారు. హర్షకుమార్ ఇంటికి వెళ్లి మరీ కలిసిన ముద్రగడకు అక్కడ హర్షకుమార్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందట. అంతేకాదు.. ఈ రెండు కులాల కాంబినేషన్లో కొత్త పార్టీ పెట్టాలని హర్షకుమార్ ప్రతిపాదించారు. రెండు బలమైన వర్గాలు కలిస్తే రాజకీయంగా వర్కవుట్ అవతుందని హర్షకుమార్ సూచించినట్లుగా చెబుతున్నారు.

హర్షకుమార్ తో భేటీ అనంతరం మీడియాతో ముద్రగడ మాట్లాడుతూ, ఏపీలో కాపులను - దళితులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగస్టుతో ముగుస్తుందని, ఆ తర్వాత తమ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కాపులు - ఎస్సీలు కలిస్తే ఏమైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే.. కొత్త పార్టీ ప్రతిపాదనను హర్షకుమార్ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని ముద్రగడ అన్నారు.

కాగా ముద్రగడ కూడా కాపులు - ఎస్సీల కాంబినేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే హర్షకుమార్ ను కలిసినప్పటికీ ఆయన ఒక్కసారిగా పార్టీ అనేసరికి వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. ఉద్యమం.. కలిసి పనిచేయడం.. కొత్త వేదిక ఏర్పాటు చేసుకోవడం వరకు ఓకే అయినా, కొత్త పార్టీ పెడితే నిర్వహణ భారం మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిన ముద్రగడ వెనక్కు తగ్గుతున్నట్లు చెబుతున్నారు. పైగా కాపులు - ఎస్సీలను కలిసి వైసీపీకి చేరువ చేయాలన్నది ఆయన ప్రయత్నమైతే కొత్త పార్టీ అని హర్షకుమార్ ప్రతిపాదించడంతో వెనక్కు తగ్గినట్లుగా చెబుతున్నారు. మరోవైపు హర్షకుమార్ కూడా ముద్రగడ ఉద్దేశాలను అర్థం చేసుకునే తెలివిగా కొత్త పార్టీ ప్రతిపాదన తీసుకొచ్చారని అంటున్నారు.