Begin typing your search above and press return to search.

విధ్వంసం నెపం టీడీపీపై వేసిన ముద్రగడ

By:  Tupaki Desk   |   1 Feb 2016 10:32 AM GMT
విధ్వంసం నెపం టీడీపీపై వేసిన ముద్రగడ
X
తూర్పుగోదావరి జిల్లా తునిలో నిన్న జరిగిన విధ్వంసానికి తెలుగుదేశం పార్టీదే పూర్తి బాధ్యత అని కాపు గర్జన నిర్వాహకుడు ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు గర్జన సందర్భంగా విధ్వంసానికి అధికార పార్టీ నుంచే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వమని కోరినా అడ్డుకున్నారనీ ఆయన ఆరోపించారు. ఆస్తులు ధ్వంసం చేసే పద్ధతిలో తానెప్పుడూ ఉద్యమాలు చేయలేదన్నారు. కాపు గర్జనను అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయన్నారు. కనీసం భోజనాలు వండుకోవడానికి కూడా స్థలం ఇవ్వలేదని ఆయన అన్నారు.

అంతేకాదు.. తాను విధ్వంసం చేయమని చెప్పి ఉంటే ఆ విధ్వంసం ఇంకోరకంగా ఉండేదని.. కాపులు తాను ఏం చెబితే అది వింటారని ముద్రగడ అంటున్నారు. కేవలం రాస్తారోకో - రైలురోకోకే పిలుపునిచ్చానని... విధ్వంసానికి పాల్పడమని చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.అయితే... కాపుల కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు.

ప్రభుత్వం ఈ ఘటనలలో కేసులు పెట్టాలనుకుంటే తనపైనే పెట్టాలని.. అంతేకానీ, కాపులపై తప్పుడు కేసులు పెడితే సహించబోనంటూ వారిపై ప్రేమ చూపించారు. తనను అరెస్టు చేస్తే కాపులెవరూ కిర్లంపూడి వచ్చి అడ్డుకోవద్దని ఆయన అన్నారు. ఎవరి ఇంటి వద్ద వారు బయటకు వచ్చి అన్నం పళ్లెం గంట కొడితే చాలని అన్నారు. తనను, కాపు జాతిని అమ్ముడుపోయారని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా తాను ఆందోళన చేసినప్పుడు టిడిపి తరపున తనను ఎంతకు కొన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు.

తాను చంద్రబాబుకు కాపుల రిజర్వేషన్ లపై అనేక ఉత్తరాలు రాశానని.. అయినా ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కడుపు మంట నుంచే కాపు గర్జన జరిగిందని ఆయన అన్నారు.గతంలో మహ్మాద్ జాని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ముస్లింలను బిసిలలో చేర్చాలని లేఖ రాస్తే మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుని అమలు చేశారని ముద్రగడ చెప్పారు. అంతా బాగానే ఉన్నా.... తనను అరెస్టు చేస్తే ఎవరూ కిర్లంపూడి రావొద్దని ముద్రగడ పిలుపునివ్వడంలో ఇంకేదో పిలుపు కనిపిస్తోందని... అది కూడా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లుగానే ఉందని పలువురు అంటున్నారు.