Begin typing your search above and press return to search.

కబాలీ స్టైల్లో చంద్రబాబుకు ముద్రగడ లేఖ

By:  Tupaki Desk   |   3 April 2017 10:34 AM GMT
కబాలీ స్టైల్లో చంద్రబాబుకు ముద్రగడ లేఖ
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులు, బిసిల మధ్య చిచ్చు పెడుతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు కురిపించారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు టీంను రెడీ చేశారని... తమను పోలీసులతో కొట్టించినా, జైల్లో పెట్టినా ఉద్యమం మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. తాను ఇప్పుడు పాత ముద్రగడను కాదని, మ‌రింత‌ రాటుదేలాన‌ని లేఖలో ఆయన పేర్కొన్నారు. త‌న‌కు ఒక ధ్యేయంతో కూడిన కసి ఉందని.. చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఓ పుస్తకం రాయిస్తున్నాడని తన‌కు తెలిసింద‌ని, ఎన్ని పుస్తకాలు రాసినా తాను ఉద్యమాన్ని వీడబోన‌ని ఉద్ఘాటించారు. ‘తమరి ఆదేశాల‌తో మీ పెంపుడు ప‌త్రిక అధినేత‌, మ‌రో మీ ముద్దుల పెంపుడు వ్య‌క్తితో పుస్త‌కం రాయిస్తున్నార‌ని విన్నాను’ అని ఆయ‌న లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు త‌న‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా తాను మాత్రం కాపుల పోరాటం నుంచి వెనక్కు తగ్గనని తేల్చిచెప్పారు. త‌మ‌ను ఓడించాలని చూస్తే చంద్ర‌బాబే ఓడిపోతారని ఆయ‌న అన్నారు. చంద్రబాబులా అవినీతిపరుడిని కానని.. నేరచరితుడినీ కానని..ఉగ్రవాదిని, అబద్ధాలు చెప్పేవాడిని కానని.. కుర్చీకోసం పిల్లనిచ్చిన మామను చెప్పులుతో కొట్టించిన చరిత్ర, పదవి నుంచి దించేసిన చరిత్ర తనది కాదని అంటూ చంద్రబాబును దెప్పి పొడిచారు. తాను ఇంతగా రాటుదేలడానికి అప్పటి సీఎం ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబే కారణమని అంటూ కబాలిలో రజనీకాంత్ రేంజిలో పాత ముద్రగడను కాను.. రాటుదేలిన కొత్త ముద్రగడనని పేర్కొన్నారు.

అంతేకాదు... ‘ప‌ద‌వి కోసం ఎంత కిందికైనా దిగ‌జారే వ్య‌క్తి మీరు.. ఆ దిగ‌జారుడు త‌నం నాకు లేక పోవ‌డం, నాపై మీకు అక్క‌సు ఉండ‌డంతోనే త‌ప్పుడు రాత‌లు రాస్తున్నారు’ అని ముద్రగడ అన్నారు. ‘మీరు, మీ పెంపుడు మీడియా అధినేత పుట్టుకతోనే ఆగ‌ర్భ శ్రీ‌మంతుల కుటుంబంలో గోల్డు స్పూన్‌ తో పుట్టారు. కానీ నా జీవితం మీలాంటిది కాదండి. నేను చ‌దువులేని వ్య‌క్తిని, తెల్ల‌వారితే అప్పుకోసం ఏదో దిక్కుచూడాలి. ప్ర‌యాణం చేయాలంటే రూ.10వేలు, హైద‌రాబాద్ వెళ్లాలంటే రూ.50 వేలు అప్పుల కోసం రోడ్డెక్కాలి’ అని ముద్ర‌గ‌డ లేఖ‌లో పేర్కొన్నారు.

లేఖలో చివరగా ఆయన సెటైరిక్ గా ఓ పాటను కూడా రాయడం విశేషం.. ‘‘ఎక్కడో దూరాన కూర్చున్నారు.. ఇక్కడి మా తలరాతలు రాస్తున్నారు... చిత్రమైన గారడీలు చేస్తున్నారు.. తమాషా చూస్తున్నారు’’ అంటూ పాతపాటతో మొదలుపెట్టి... ‘‘పెరుగుతోంది పార్టీ పరువని అనుకుంటారు.. కానీ తరుగుతోంది పరపతని తెలుసుకోరు’’ అంటూ రాష్ర్టంలో పరిణామాలను ప్రస్తావిస్తూ ముగించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/