Begin typing your search above and press return to search.

కాకినాడ‌లో టీడీపీ స్పీడ్ బ్రేక‌ర్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   24 Aug 2017 5:03 PM GMT
కాకినాడ‌లో టీడీపీ స్పీడ్ బ్రేక‌ర్ ఎవ‌రు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల‌కు కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల టెన్ష‌న్ ప‌ట్టుకుందా? ఈ ఎన్నిక‌లో గెలుపు టీడీపీకి అంత తేలిక ఏమీ కాద‌ని అనుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టీడీపీలో ఈ చ‌ర్చ‌కు కార‌ణం కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కోర్టు తీర్పుతో జ‌రుగుతున్న కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ కాపు ఉద్యమ నేత ముద్రగడ ప్రభావం బాగానే ఉంటుంద‌ని - స‌హ‌జంగానే అది త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని టీడీపీ శ్రేణుల్లో చ‌ర్చ జరుగుతున్న‌ట్లు స‌మాచారం.

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాపులను బీసీల్లో చేర్చుతామని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చాలా కాలం నుంచి ఉద్యమం నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ హామీని నిలుపుకోవ‌డంతో జాప్యం జ‌రుగుతుండ‌టంతో `చలో అమరావతి` పేరుతో పాదయాత్ర చేప‌ట్టా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు నెలరోజులుగా అప్ర‌క‌టిత గృహ‌నిర్భందం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ కిర్లంపూడిలో వందలాదిమంది పోలీసులను మోహరింపజేసింది. దీంతో ప్రతిరోజూ చంద్రబాబు తీరుపైన ముద్రగడ - ఆ సామాజిక తరగతికి చెందిన నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు మోసగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడకు మద్దతుగా కిర్లంపూడితో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పడే అవకాశంపై నగరంలో సర్వత్రా చర్చలు సాగుతున్నాయి.

సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికాంశాలు ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. కానీ కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల చర్చోపర్చలను గమనిస్తే.. స్థానికాంశాలకు భిన్నంగా ఈ ఎన్నికలను పరిగణిస్తున్నట్లు చెప్తున్నారు. . కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీసీని ఓడించేందుకు గట్టిగా కృషి చేయాలని ఇప్పటికే ముద్రగడ - ఆయన ఉద్యమంలో ఉన్న నేతలు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను కల్పించకపోయినా రుణాల పేరుతో నిధులు మంజూరు చేసి - అధికార పార్టీలో కొంతమందికే దక్కేలా చేశారనే విమర్శలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన వెనుకబడిన తరగతులకు చెందిన వనమాడి వెంకటేశ్వరరావు గెలుపులో ముద్రగడకు చెందిన సామాజిక తరగతివారే కీలకంగా వ్యవహరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులకు ఏకపక్షంగా ఆ సామాజిక తరగతి మద్దతు పునరావృతమవడం సాధ్యమయ్యేది కాదని విశ్లేషకుల భావన.

కాగా, ఈ నెల 29న జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో 2,36,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 45 వేల మంది కాపు సామాజిక తరగతికి చెందినవారు కాగా 41 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులు సహా బీసీల్లోని అన్ని కులాలు కలిపితే 62 వేల మంది వరకూ ఉన్నారు. ఎస్‌సిలు 22 వేల మంది - వ్యాపార వర్గాలకు చెందిన సామాజిక తరగతికి మరో 20 వేల మంది - మైనారిటీలకు 14 వేల మంది ఉండగా - మిగిలిన సామాజిక తరగతుల నుంచి మరో 73వేల మంది ఓటర్లుగా ఉన్నారు.