Begin typing your search above and press return to search.

బాబు కాళ్లు క‌డుగుతాన‌న్న ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   9 Feb 2016 4:08 AM GMT
బాబు కాళ్లు క‌డుగుతాన‌న్న ముద్ర‌గ‌డ‌
X
కాలం ఎంత విచిత్ర‌మైంది. తిట్టే నోటితోనే పొగిడేయటం.. పొగిడేసిన నోటితోనే తిట్టేయటం రాజకీయాల్లో కనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం వ్యవహారమే తీసుకోండి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు ఎకరాల ఆస్తి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. 2లక్షల కోట్ల సంపదను ఎలా పోగేసుకోవాలో బహిరంగంగా చెబితే.. తమ జాతి వాళ్లు రిజర్వేషన్లు అడగరంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి.. 20 ఏళ్ల పాటు తాము ఉద్యమాన్ని పక్కన పడేశామని.. కాపు ఉద్యమానికి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఆక్సిజన్ ఇచ్చారని.. ఏదైనా అనరాని మాటలు అని ఉంటే తనను క్షమించాలని వ్యాఖ్యానించటం గమనార్హం.

కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తనకిచ్చిన హామీల్ని నెరవేర్చిన పక్షంలో చంద్రబాబు కాళ్లు కడగటానికైనా తాను సిద్ధమన్న విషయాన్ని ముద్రగడ స్పష్టం చేశారు. ‘‘మిమ్మల్ని అనరాని మాటలు అని ఉంటాను. క్షమించమని అడుగుతున్నాను. కమిషన్ రిపోర్ట్ ఇచ్చి.. మీరు వాటిని అమలు చేస్తే.. నేను మీ ఇంటికి వచ్చి పళ్లెంలో మీ కాళ్లు పెట్టి కడుతాం. మా జాతికి మంచి జరగటానికి మీరు కృషి చేస్తే మీ కాళ్లు మొక్కటానికి సైతం నేను సిద్ధం. మా జాతికి అన్నం పెట్టమని అడుగుతున్నాను. అది కూడా పేదలకు మాత్రమే’’ అంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ వ్యక్తే.. 24 గంటల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నిప్పులు చెరింగిందా? అన్న సందేహం రాక మానదు.

నిజానికి ఉద్యమం చేస్తున్న నాయకుడి దృష్టి ఉద్యమంలో తాము సాధించాల్సిన అంశాల మీదనే దృష్టి ఉండాలే తప్పించి రాజకీయ విమర్శల మీదన కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ ఎప్పుడూ.. తెలంగాణ ఇవ్వగలిగిన సత్తా ఉన్న సోనియాగాంధీని పల్లెత్తు మాట అనేవారు. నిజానికి కేసీఆర్ లాంటి వ్యక్తి.. ఎవరినైనా ఎంత మాటైనా అనగలరు. కానీ.. అలాంటి విమర్శలతో ఉద్యమం పక్కదారి పట్టటమే కాదు.. వరం ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండాపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో అందరిని తిట్టి పోసిన కేసీఆర్.. సోనియాగాంధీని మాత్రం పల్లెత్తు మాట అనే వారు.

తమ జాతిలోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలే కానీ పళ్లెంలో కాళ్లు కడిగేందుకు సైతం తాను సిద్ధమంటూ పెద్ద మాటల్ని చెప్పేసిన ముద్రగడ.. తన దీక్ష సమయంలో మరింత సంయమనంతో వ్యవహరించి ఉంటే బాగుండేది. అదేసమయంలో.. తమ డిమాండ్లను నెరవేరిస్తే.. కాళ్లు కడుగుతాను లాంటి మాటల్ని అనకుండా ఉండి ఉంటే బాగుండేది. అయితే తిట్ల దండకం.. లేదంటే అందుకు భిన్నంగా సాగిలపడిపోవటం లాంటి వైరుధ్యాలు రాజకీయ నాయకుడికి ఉండొచ్చేమో కానీ.. ఉద్యమ నేతలకు ఉండకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.