Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ ఇక ఓపిక ప‌ట్టేది లేదట‌

By:  Tupaki Desk   |   14 Jun 2017 1:11 PM GMT
ముద్ర‌గ‌డ ఇక ఓపిక ప‌ట్టేది లేదట‌
X
మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చేనెల 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతికి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రెండుసార్లు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో ఈ సారి శాంతియుతంగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. జిల్లాల వారీగా ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన కాపులకు బీసీ రిజ‌ర్వేష‌న్‌ విష‌యంలో మాట నిల‌బెట్టుకోలేద‌ని కాపు జేఏసీ నేత‌లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి మూడేళ్లు పైబడినా కాపు రిజర్వేషన్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని, కార్పొరేషన్‌ తోనే సరిపెడుతున్నారనే వాదనలు జేఎసి నేతలు వ్యక్తపరుస్తున్నారు. రాజధానికి పాదయాత్ర చేయటం ద్వారా ఇక ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్‌ ను కూడా ముద్రగడ కలిసి మద్దతు కోరారు. బీసీ సంఘాల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ముందుగా ఉభయగోదావరి జిల్లా నేతలతో సమావేశమై చర్చించారు. తాజాగా కిర్లంపూడిలో కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. జిల్లాకు 20 మంది చొప్పున 13 జిల్లాల నుంచి పాదయాత్రకు జేఏసీ నేతలను కూడగట్టి 450 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరపాలని నిర్ణయించారు. కిర్లంపూడి నుంచి భీమవరం - తణుకు - తాడేపల్లిగూడెం - తదితర ముఖ్యపట్టణాలు - కాపు గ్రామాలను కలుపుకుంటూ పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్రకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం గృహనిర్బంధం చేయటంతో అప్పట్లో యాత్రను వాయిదా వేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/