Begin typing your search above and press return to search.

అదే కంచం..అదే గరిట..అదే నిరసన..అదే మాటలు

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:34 AM GMT
అదే కంచం..అదే గరిట..అదే నిరసన..అదే మాటలు
X
కాపులను బీసీల్లో చేర్చాలంటూ కొద్ది నెలల క్రితం కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన దీక్ష సందర్భంగా తన ఇంట్లోనే.. తన భార్య.. కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేయటం.. అధికారులు ఎంత చెప్పినా మాట వినని ఆయన.. దీక్షను విరమించేందుకు ససేమిరా అనటం తెలిసిందే.

కంచం పట్టుకొని గరిటతో కొడుతూ నిరసన వ్యక్తం చేయటం.. పెద్దగా మాట్లాడని ఆయన.. మౌనంగా ఉండటం లాంటి పనులు చేస్తూ ఏపీ సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పరిస్థితి. చివరకు ఆయన నిరసన దీక్షకు తలొగ్గిన ఏపీ సర్కారు మంత్రులను పంపి ఆయనతో చర్చలు జరిపి.. దీక్షను విరమింప చేశారు. తాజాగా తుని విధ్వంసం కేసులో బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. అందుకు నిరసనగా ఆయన మరోసారి దీక్షను షురూ చేశారు.

గతంలో మాదిరి తన ఇంట్లో.. తన సతీమణితో దీక్షకు దిగిన ఆయన.. తన ఇంటికి ఎవరూ రావొద్దని.. తన దీక్షకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ గతంలో మాదిరే కంచం.. గరిట పట్టుకొని దాన్ని కొడుతూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తుని ఘటనపై కొందరిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయటంతో పాటు.. తుని విధ్వంసకారులుగా గుర్తించి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన ఆందోళన షురూ చేశారు. తాజా ఆందోళనతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈసారి తాను ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని తేల్చేసిన నేపథ్యంలో.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.