Begin typing your search above and press return to search.

బాబుకు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌ని ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:55 AM GMT
బాబుకు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌ని ముద్ర‌గ‌డ‌
X
బ‌ల‌మైన ఉద్య‌మ‌నేత‌లు ఉంటే పాల‌కుల‌కు మ‌న‌శ్శాంతి అస్స‌లు ఉండ‌దు. అందుకే తెలివైన అధినేత‌లు ఏదైనా ఇష్యూ ఉంటే దాని ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేసేలా చూస్తారే కానీ.. విష‌యం ఉద్య‌మం వ‌ర‌కూ వెళ్లేలా అస్స‌లు చూడ‌రు. అయితే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు కాస్త భిన్నం.

అడ‌గ‌కుండానే హామీలు ఇచ్చేయ‌టం.. లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకోవ‌టం ఆయ‌న‌కు అల‌వాటే. ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కారుకు సినిమా చూపిస్తున్న కాపుల రిజ‌ర్వేష‌న్ ముచ్చ‌ట‌కే వ‌స్తే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాపు రిజ‌ర్వేష‌న్ల మాట‌ను చెప్పి.. తాను ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే తానిచ్చిన హామీని నెర‌వేర్చుకుంటానని చెప్పారు.

ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత తానిచ్చిన హామీని అమ‌లు చేయ‌ని బాబు.. ఇష్యూను అంత‌కంత‌కూ పెద్ద‌ది చేసుకుంటున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో బాబు స‌ర్కారు తీరుపై ఆ వ‌ర్గానికి చెందిన వారు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌మ డిమాండ్‌ను గ‌డిచిన మూడేళ్లుగా ప‌రిష్క‌రించ‌ని నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వ తీరుపై గుస్సాతో ఉన్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని తీసుకొని ఉద్య‌మం చేస్తున్న కాపు నేత‌.. మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై ఆంక్ష‌లు విధిస్తున్నారు.

రిజ‌ర్వేష‌న్ల అంశంపై పాద‌యాత్ర చేద్దామ‌నుకున్న ఆయ‌న్ను గృహ నిర్భందంలో ఉంచిన తీరు ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. పాద‌యాత్ర చేస్తాన‌న్న ముద్ర‌గ‌డ‌కు అనుమ‌తిని ఇవ్వ‌క‌పోవటాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. అనూహ్య నిర్ణ‌యాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ అధికార‌ప‌క్షానికి షాకులు ఇచ్చే ముద్ర‌గ‌డ తాజాగా అదే రీతిలో మ‌రోసారి స్పందించారు.

గురువారం ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచి పాద‌యాత్ర మొద‌ల‌వుతుంద‌ని ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించారు. కాపు సంఘాల నేత‌లు.. అభిమానులు అంతా తాను నిర్వ‌హించే పాద‌యాత్ర‌కు త‌ర‌లిరావాలంటూ పిలుపునిచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ గృహ‌నిర్భందంలో ఉన్న ఆయ‌న‌.. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పాద‌యాత్రను జ‌ర‌గ‌నీయ‌మ‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. గ‌తంలో పాద‌యాత్ర‌కు పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ పోలీసులు అడ్డుకోవ‌టం పాద‌యాత్ర స్టార్ట్ కాలేదు. మ‌రి.. ఈ రోజు నుంచైనా షురూ అవుతుందేమో చూడాలి.