Begin typing your search above and press return to search.

మధ్యలో మీడియా ఏం పాపం చేసింది సార్!

By:  Tupaki Desk   |   14 Oct 2017 4:26 AM GMT
మధ్యలో మీడియా ఏం పాపం చేసింది సార్!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు సంబంధించి ఇచ్చిన హామీని విస్మరించి... చంద్రబాబునాయుడు మాటలతో పబ్బం గడిపేస్తున్నదని ఆ వర్గంలో ఒక నిశ్చితాభిప్రాయం ఉంది. అందుకే ఆరునెలల్లోగా చంద్రబాబు ఇస్తానని చెప్పిన రిజర్వేషన్ ను ఇప్పటికైనా ఇవ్వాలంటూ కాపుపోరాటాలు సాగుతున్నాయి. ఇవి ప్రభుత్వాన్ని తరచుగా చికాకు పెడుతూ.. ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీళ్ల పోరాటాలు సమస్తం మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నాయి. అయితే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రం.. కాపు ఉద్యమానికి మీడియా సహకారం అంతంతమాత్రంగా ఉంటోందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమం ప్రారంభించిన నాటినుంచి మీడియా ఆయనకు చాలా అండదండగానే నిలిచింది. ఇక్కడ మీడియా ముద్రగడకు లేదా కాపులకు అండగా నిలిచిందనడం కాకుండా, చంద్రబాబునాయుడు మాట తప్పడం నిజమే గనుక, ఆ విషయంలో వారు పోరాటమార్గాన్ని అనుసరించడం సబబే గనుక.. దానికి తగ్గట్లుగానే వారి పోరాటానికి మీడియా ప్రచారం కల్పించింది. తొలిదశ కాపుగర్జన – తదనంతర ముద్రగడ పరిణామాల మీద తెలుగు టీవీ ఛానెళ్ల కొన్ని వందల గంటల లైవ్ ప్రసారాలను అందించాయంటే అతిశయోక్తి కాదు. అలాగే ముద్రగడ వాదనను డిస్కషన్లు - చర్చా కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ముద్రగడ పాదయాత్ర కు సిద్ధమైన ప్రతిసారీ ప్రభుత్వం దాన్ని ఎలా అణచివేస్తున్నదో కూడా లైవ్ ప్రసారాల ద్వారానే ప్రజలకు తెలియజెప్పారు.

ఇంతకంటె ఎక్కువగా మీడియా తమ ఉద్యమానికి ఎలాంటి మద్దతు అందించాలని ముద్రగడ కోరుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు. కాపు వాదనకు అనుకూలంగా అసత్యాలు కూడా ప్రచారంలో పెట్టాలని ఆయన ఆశిస్తున్నారేమో తెలియదు. నిజానికి వారిది ధర్మాగ్రహమే గనుక.. వారి వాదనలో నిజం ఉన్నది గనుక.. దక్కవలసినంత ప్రచారం సబబుగానే దక్కిందనే అభిప్రాయం మీడియా వర్గాల్లోను ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది.

ఆ మాటకొస్తే ముద్రగడ పద్మనాభం తన అక్కసు వెళ్లగక్కాల్సింది మీడియా మీద కానే కాదని, తెలుగు దేశం ప్రాపకంలో ఉన్నందుకు గాను కాపు సామాజిక వర్గానికి ద్రోహం జరిగేలా.. లోపాయికారిగా వ్యవహరిస్తున్న తమ కులస్తుల గురించే ఆయన మాట్లాడాలని పలువురు అంటున్నారు. రిజర్వేషన్ ప్రయోజనం సిద్ధిస్తే అందరూ దానిని అనుభవిస్తారు. అయితే తెదేపాలో ఉన్నందుకు పోరాటాన్ని కించపరిచేలా మాట్లాడే వారు కూడా చాలా మంది తయారవుతున్నారు.. కులానికి వారితోనే చేటు జరుగుతోందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.