Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ... బాబుకు డెడ్‌లైన్ పెట్టేశారు!

By:  Tupaki Desk   |   15 Oct 2017 12:45 PM GMT
ముద్ర‌గ‌డ... బాబుకు డెడ్‌లైన్ పెట్టేశారు!
X
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న ఒకే ఒక్క కాంక్ష‌తో బ‌రిలోకి దిగిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... త‌న క‌ల‌ను సాకారం చేసుకునేందుకు నోటికొచ్చిన వాగ్దానాల‌న్నీ గుప్పించేశారు. వాటిలో ఒక‌టే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు. అప్ప‌టిదాకా రిజ‌ర్వేష‌న్ల కోసం కాపులు పెద్ద‌గా ఉద్య‌మాలేమీ చేసిన దాఖ‌లా లేదు. అప్పుడ‌ప్పుడు ఈ డిమాండ్ వినిపించినా... ప్ర‌స్తుతం కాపు ఐక్య‌వేదిక నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేస్తున్న త‌ర‌హాలో ఉద్య‌మం మాత్రం జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప్ర‌చారాన్ని హోరెత్తించిన చంద్ర‌బాబు... తాను అధికారంలోకి వ‌స్తే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని, కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి ఏక‌విడ‌త‌గా దానికి వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో త‌మ సామాజిక వ‌ర్గానికి ప్ర‌యోజ‌నం త‌ప్ప‌క జ‌రుగుతుంద‌ని భావించిన కాపులు టీడీపీకి ఓటేశారు.

ఇలా ఆయా వ‌ర్గాల‌న్నింటినీ త‌న వైపున‌కు తిప్పుకునేందుకు చంద్రబాబు హామీలైతే చేశారు గానీ... అధికారం ద‌క్కిన త‌ర్వాత వాటి అమ‌లును మాత్రం అట‌కెక్కించార‌నే చెప్పాలి. ఈ త‌ర‌హాలో అట‌కెక్కిన హామీల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశం కూడా ఒక‌టిగా చెప్పుకొవాలి. ఎందుకంటే... ఈ దిశ‌గా బాబు స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్నా... మొత్తం వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తే... ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ప‌రిస్థితి త‌యారైంద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఉద్య‌మ శంఖారావం పూరించిన ముద్ర‌గ‌డ‌... బాబుకు కాపు ఉద్య‌మం దెబ్బ రుచిచూపించారు. ఫ‌లితంగా కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసిన బాబు... కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోస‌మంటూ జ‌స్టిస్ మంజునాథ క‌మిష‌న్ వేసి కాల‌యాప‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మిష‌న్ ఎప్పుడు నివేదిక ఇస్తుందో, ప్ర‌భుత్వం ఎప్పుడు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టిస్తుందో కూడా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్న ముద్ర‌గ‌డ‌... చంద్ర‌బాబు స‌ర్కారు జాప్యంపై పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే చాలా సార్లు ఉద్య‌మం చేసిన ముద్ర‌గ‌డ‌... ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వం క‌లిగిస్తున్న అడ్డంకుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌... చంద్ర‌బాబు స‌ర్కారుకు తుది డెడ్ లైన్ విధిస్తున్న‌ట్లుగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. డిసెంబ‌ర్ 6 వ‌ర‌కు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు చంద్ర‌బాబు స‌ర్కారుకు అవ‌కాశ‌మిస్తున్నామ‌ని, అప్ప‌టికీ ప్ర‌భుత్వం మేల్కోక‌పోతే... త‌మ స‌త్తా ఏమిటో చూపిస్తామ‌ని ముద్ర‌గ‌డ డేంజ‌ర్ బెల్స్ మోగించారు.

ఈ సంద‌ర్భంగా ముద్ర‌గ‌డ మ‌రో కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించారు. ఇతర కులాలు అనుభవిస్తున్న 49 శాతంలో తమకు వాటా వద్దని, 51 శాతంలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని చెప్పారు. కాపు జాతి రోడ్డెక్కే పరిస్థితి తెచ్చింది చంద్రబాబేనని, రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపే అన్ని కులాలను కలుపుకునిపోతామని, అందులో భాగంగానే సామాజిక పరివర్తన సమావేశాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పల్స్ సర్వే ఒక్క రోజులోనే నిర్వహించారని, ఆ రిపోర్టును సీఎం కేసీఆర్ పరిశీలించి 9వ షెడ్యూల్ లో చేర్చారని, మరి, ఏపీలో సీఎం చంద్రబాబు ఏ నివేదికను తెప్పించుకోలేదని ఎద్దేవా చేశారు.