Begin typing your search above and press return to search.

రూ.5.5కోట్లు పెడితే చారిత్రక ఇల్లు?

By:  Tupaki Desk   |   13 Dec 2015 3:43 AM GMT
రూ.5.5కోట్లు పెడితే చారిత్రక ఇల్లు?
X
వెల కట్టలేని ఓ అద్భుతమైన ఇల్లు కేవలం రూ.5.5కోట్లకు అమ్మకానికి పెట్టేశారు. క్రీడాభిమానుల మదిలో చిరంజీవిగా నిలిచిపోయిన ప్రముఖ బాక్సర్ ముహమ్మద్ అలీకి చెందిన ఇంటిని తాజాగా ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేశారు. అమెరికాలోని న్యూజెర్సీలోని చెర్రీ హిల్స్ లో దీన్ని నిర్మించారు. దాదాపు 1.5ఎకరాల్లో 6,688 చదరపు అడుగుల్లో కళాత్మకంగా నిర్మించిన ఈ ఇల్లు అలీ ఎంతో అభిమానించే వారు.

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట.. 1971 నుంచి 1974 మధ్య కాలంలో ఈ ఇంట్లోనే ఆయన నివసించారు. ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన విజయాన్ని.. మర్చిపోలేని పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రపంచ హెవీ ఛాంపియన్ షిప్ లో ఓడిపోయారు. విజయం సాధించారు కూడా. మాంచి టేస్ట్ తో నిర్మించిన ఈ ఇల్లు నందనవాన్ని తలపిస్తుంది.

చుట్టూ చెట్లు.. ప్రకృతి రమణీయతతో కట్టిపడేసే ఈ ఇంట్లో.. ఐదు బెడ్ రూమ్ లు.. ఐదు బాత్ రూమ్ లతో పాటు.. విశాలమైన హాలు.. 45 అడుగుల బార్ కూడా ఉంది. అంతేకాదు.. అత్యాధునిక కిచెన్.. సామాగ్రితో ఉన్న ఈ ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్.. అవసరానికి తగ్గట్లుగా మార్చుకునే అవకాశం ఉన్న వాలీబాల్.. టెన్నిస్ కోర్టుగా మలుచుకునే స్థలం ఉండటం గమనార్హం. ఇవాళ రేపటి రోజున.. ఏమీ లేని అమరావతిలో ఎకరం రూ.1.5కోట్ల వరకూ పలుకుతున్న నేపథ్యంలో.. కాస్తంత టేస్ట్.. మరికాస్త డబ్బులున్న వారు ఎవరైనా ఈ ఇంటిని సొంతం చేసుకుంటే బాగుండు. ఘనమైన చరిత్ర ఉన్న ఈ ఇంటికి నిజంగా వెల కట్టటం కష్టమే సుమా.