Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు..!

By:  Tupaki Desk   |   2 Sep 2019 8:29 AM GMT
మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు..!
X
ఆశావ‌హులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రా త‌ర్వాత రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే కేబినెట్‌ లో ఎవరికి చోటు కల్పించాలనే అంశంపై ఇప్పటికే ఆయ‌న స్పష్టమైన నిర్ణ‌యానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పెద్దగా మార్పులు - చేర్పులు లేకుండానే మరో నలుగురు లేదా ఐదుగురికి కొత్త‌గా అవకాశం ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

గవర్నర్‌ బదిలీ - బడ్జెట్‌ సమావేశాలు - బతుకమ్మ పండుగ వరుసగా వస్తుండటంతో ఆ తర్వాతే విస్తరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు భావిస్తున్నట్లు తెలిసింది. సామాజికవర్గాల సమ తౌల్యత పాటిస్తూ మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు స‌మాచారం. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభమై మూడో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రానికి కొత్తగా వ‌చ్చిన గవర్నర్ బాధ్యతలు స్వీకరించే తేదీపై స్పష్టత రాలేదు. ఈనేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లోగా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈసారి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తోపాటు మ‌రో సీనియ‌ర్ నేత మాజీ మంత్రి హరీశ్ రావును తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారా..లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే హరీశ్‌ రావుకు చోటు కల్పించకుండా తాను ఒక్కడినే మంత్రివర్గంలో చేరితో విమర్శలు వస్తాయని కేటీఆర్‌ లో భావి స్తున్నట్లు సమాచారం. కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కు ఇప్పటికే కేబినెట్‌ హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. అదే సామాజికవర్గం నుంచి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ తోపాటు ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీంతో మంత్రివర్గంలో హరీశ్‌ రావు చేరిక అంశం కొలిక్కి వస్తేనే విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే దసరా తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి - ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి - సత్యవతి రాథోడ్‌ కు బెర్తులు ఖాయమైనట్లు పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా - డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ శనివారం తన కుమార్తె - మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితతో కలిసి కేటీఆర్‌ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు చాలామంది ఆశావ‌హులు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.