Begin typing your search above and press return to search.

మెట్రో రైల్ ముహుర్తం ఖ‌రారైంది

By:  Tupaki Desk   |   18 Nov 2017 6:20 AM GMT
మెట్రో రైల్ ముహుర్తం ఖ‌రారైంది
X
ఏళ్ల‌కు ఏళ్లుగా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్న హైద‌రాబాద్ మెట్రోరైల్ ముందు అనుకున్న‌ట్లే ఈ నెల 28న ప్రారంభం కానుంది. మెట్రో రైలును 28 నుంచి 30 మ‌ధ్య‌లో ప్రారంభించాలంటూ ప్ర‌ధాని మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరిన సంగ‌తి తెలిసిందే.

అంత‌ర్జాతీయ బిజినెస్ స‌మ్మిట్ లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వ‌స్తున్న ప్ర‌ధాని మోడీ.. ప‌నిలో ప‌నిగా హైద‌రాబాద్ మెట్రో రైల్ ను ప్రారంభించ‌నున్నారు. పోలీసు అధికారుల‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం 28 మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల నుంచి ఒంటి గంట మ‌ధ్య‌లో ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌ కు ప్ర‌త్యేక విమానంలో బేగంపేట‌కు చేరుకుంటారు. అక్క‌డ నుంచి నేరుగా మియాపూర్ కు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మూడు గంట‌ల మ‌ధ్య‌లో మెట్రో స్టేష‌న్‌ ను ప్రారంభిస్తారు. అక్క‌డ ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్‌ ను ప్రారంభిస్తారు.

ఆ త‌ర్వాత హైద‌రాబాద్ మెట్రో రైల్ ను ఎక్కి ఎస్ ఆర్ న‌గ‌ర్ వ‌ర‌కు కానీ.. అమీర్ పేట వ‌ర‌కు కానీ ప్ర‌యాణిస్తారు. అమీర్ పేట వ‌ర‌కు ఆయ‌న ప్రయాణం సాగిన ప‌క్షంలో అమీర్ పేట ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్ ను ప‌రిశీలిస్తారు. తిరిగి మియాపూర్ చేరుకుంటారు. మియాపూర్ లో ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడిన అనంత‌రం మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో జ‌రిగే బిజినెస్ స‌మ్మిట్‌ కు హాజ‌ర‌వుతారు.

హైద‌రాబాద్ మెట్రో రైల్ ను మోడీ ప్రారంభించి.. స్టేష‌న్ నుంచి తిరిగి వెళ్లిన రెండు గంట‌ల త‌ర్వాత నుంచి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల కోసం మెట్రో రైల్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అధికారులు అందిస్తున్న అన‌ధికారిక స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే.. సాయంత్రం ఐదు గంట‌ల నుంచి ఆరు గంట‌ల మ‌ధ్య‌లో ప్ర‌జ‌ల‌కు మెట్రో స్టేష‌న్ అందుబాటులోకి రానుంద‌ని చెబుతున్నారు.