Begin typing your search above and press return to search.

ముఖేశ్ అంబానీ భారీ స్కెచ్.. జియోతో రూ.7.5లక్షల కోట్ల వసూళ్లు!

By:  Tupaki Desk   |   9 Jan 2022 11:30 AM GMT
ముఖేశ్ అంబానీ భారీ స్కెచ్.. జియోతో రూ.7.5లక్షల కోట్ల వసూళ్లు!
X
'థింక్ బిగ్' అన్న మాటను నిత్యం స్మరించుకుంటూ.. తాను చేసే ఏ వ్యాపారమైనా సరే.. ఆ లైన్ లో ఉండేలా చేయటంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తర్వాతే ఎవరైనా. దేశంలో డిజిటల్ విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లటంలో ముఖేశ్ అంబానీ జియో పాత్ర ఎంతన్నది అందరికి తెలిసిందే. భారత టెలికాం రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయటంతో పాటు.. ఒక్కసారి భారీ లాంగ్ జంప్ చేస్తే ఎలా ఉంటుందో.. అలా చేసి చూపించిన ఘనత జియో సొంతం. దీని కోసం భారీ పెట్టుబడులు పెట్టిన ముఖేశ్ అంబానీ.. దాన్ని తిరిగి రాబట్టుకోవటం కోసం మరెంత తెలివిగా ప్లాన్ చేసింది.. క్లిష్టమైన కరోనా టైంలో ముఖేశ్ అంబానీ చేసిన ప్రకటనలే నిదర్శనంగా చెప్పాలి.

జియోను దిగ్గజ కంపెనీలైన గూగుల్.. ఫేస్ బుక్ సంస్థలకు వాటాల్ని అమ్మటం ద్వారా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లటమే కాదు.. తిరుగులేని శక్తిగా మార్చేశారు. ఈ రెండు కంపెనీలతో పాటు.. రానున్న రోజుల్లో జియోకు అవసరమైన టెక్నాలజీ సంస్థలన్ని.. దానిలో భాగస్వాములుగా ఉండటం మరింత కలిసి వచ్చేలా చేశారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్10 శాతం పెట్టుబడి పెడితే.. గూగుల్ 8 శాతం జియోలో పెట్టుబడులు పెట్టిన మరిన్ని కంపెనీలు ఉండటం తెలిసిందే. ఈ మొత్తం కంపెనీలు కలిసి జియోలో పెట్టిన పెట్టుబడులు దగ్గర దగ్గర రూ.1.52 లక్షల కోట్లుగా చెప్పాలి.

తాజాగా జియోను ఐపీవో దిశగా అడుగులు వేయించటం ద్వారా మార్కెట్ నుంచి మరింత భారీగా మొత్తాల్ని రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది రిలయన్స్ జియో ఐపీవోకు అవకాశం ఉన్నట్లుగా అంతర్జాతీయ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఏజెన్సీ సీఎల్ఎస్ఏ ఒక నోట్ ను విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న అంచనా ప్రకారం చూస్తే.. జియో ఐపీవో నుంచి సుమారు రూ.7.5 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని మార్కెట్ నుంచి సమీకరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు లేదంటే మూడో త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూకు వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. జియోలో ఇప్పటికే పలు సంస్థలు భాగస్వామ్యం ఉండటం వల్ల సపరేట్ గా లిస్టింగ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంచనా నిజమైతే రిలయన్స్ జియో పంట పండినట్లే. ఆ సంస్థ స్థాయి మరో లెవల్ కు వెళ్లటం ఖాయ. ఒక్కసారిగా రూ.7.5లక్షల కోట్లు సమకూరితే.. మరెన్ని పెట్టుబడులు పెట్టటం ద్వారా రిలయన్స్ మరెన్నో అద్భుతాల్నిక్రియేట్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.